
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంకీర్ణ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్రలు చేసిందన్నారు. బలపరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు మీ (స్పీకర్) ముందు ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేలా కనబడుతున్నాయి. ఎటువంటి సందర్భంలో ఈ రాజీనామాలు చేశారో గమనించాలి. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. చర్చ జరిగిన తర్వాతే నా సీటు హస్తగతం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తొందరపడకండి. ఇవాళ కాకపోతే, సోమవారం అయినా అధికారాన్ని అందుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను బీజేపీ అధినాయత్వం తొలగించినప్పుడు తనను తప్పించొద్దని రెండు చేతులు జోడించి ఆయన ప్రాధేయపడ్డారు. కానీ నేను అలా చేయను. పదవి కోసం ఎవరినీ వేడుకోను. కాంగ్రెస్ నాయకులే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు సీఎం సీటు ముఖ్యం కాదు. నా ఆలోచన అంతా భవిష్యత్ తరాల గురించే. ప్రభుత్వాలను ఇలా కూల్చడానికే స్వాతంత్ర్య సమరయోధులు మనకు ప్రజాస్వామ్యాన్ని అందించారా’ అంటూ ప్రశ్నించారు.
తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. తనపై అపనిందలు వేసినవారు ముందుగా తమ బతుకెంటో తెలుసోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. తన దగ్గర డబ్బు లేకపోయినా, విలువలకు కట్టుబడే నైజం ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బలపరీక్ష వెంటనే నిర్వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: అసెంబ్లీలోనే భోజనం, నిద్ర)
Comments
Please login to add a commentAdd a comment