‘తెలంగాణ డిక్టేటర్‌ షిప్‌కు కేరాఫ్‌ అడ్రస్‌’ | Kuntiya And Uttam Slams TRS | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ డిక్టేటర్‌ షిప్‌కు కేరాఫ్‌ అడ్రస్‌’

Published Fri, Jun 7 2019 8:22 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Kuntiya And Uttam Slams TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ డిక్టేటర్‌ షిప్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ, సీఎల్పీ నేతలు ఫిర్యాదు చేసిన స్పీకర్‌ పట్టించుకోలేదని తెలిపారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్‌ఎస్‌లో చేరారనేది అవాస్తమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇంకో లేఖ ఇచ్చే హక్కు లేదని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్‌ పదవికి అప్రతిష్ట పాలు చేశారని ఆరోపించారు. స్పీకర్‌ హైదరాబాద్‌కు రావడానికి భయపడితే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బాన్సువాడకు వెళ్లి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారని అన్నారు. స్పీకర్‌కు ఇది తగునా అని​ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ నైతికత గురించి మాట్లాడుతున్నారని.. అలాగైతే 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం బాధకమరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ వీలినంపై సోమవారం మరోసారి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఎలా లబ్ది పొందారనే ఆధారాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కేవలం ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి కొనుగోలు చేసారని ఆరోపించారు. కాంగ్రెస్‌ సింబల్‌ మీద గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరిన ఇబ్బంది లేదన్నారు. ఒక దళిత నాయకుడు సీఎల్పీ నేతగా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. శనివారం ఇందిరా పార్క్‌ దగ్గర చేపట్టే నిరహారదీక్షకు కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement