సున్నా వడ్డీకి సున్నంపై ప్రశ్నించాల్సింది బాబునే | Kurasala Kannababu Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీకి సున్నంపై ప్రశ్నించాల్సింది బాబునే

Published Mon, Jul 13 2020 4:07 AM | Last Updated on Mon, Jul 13 2020 8:26 AM

Kurasala Kannababu Fires On Chandrababu Naidu - Sakshi

► టీడీపీ సర్కారు హయాంలో సున్నా వడ్డీ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? చంద్రబాబు నిర్వాకంవల్లే గతంలో సున్నా వడ్డీ అమలు కాలేదు. సున్నా వడ్డీ పథకానికి ఏది అండా..? అని ‘ఈనాడు’ ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. 
► చంద్రబాబు నిర్వాకంవల్లే సహకార బ్యాంక్‌లు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. గత ఐదేళ్లలో రైతులకు జరిగిన నష్టంపై ఆయన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని కప్పిపెట్టేసి కేవలం బ్యాంకుల వల్లే రైతులు నష్టపోయారని ‘ఈనాడు’ ఎలా రాస్తుంది?
► చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో వడ్డీ రాయితీ కోసం బడ్జెట్‌లో రూ.1,799.12 కోట్లు కేటాయించి విడుదల చేసింది మాత్రం కేవలం రూ.685 కోట్లే. చంద్రబాబు హయాం నుంచి ఉన్న పాతబకాయిలను సైతం మా ప్రభుత్వం చెల్లిస్తోంది. 
► సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయాలతో రైతు లకు మేలు చేస్తున్న విషయం ‘ఈనాడు’కు కనిపించడం లేదా? సీఎం రైతులకు మంచి చేస్తున్నా ఎందుకు బురద చల్లుతున్నారు?

సాక్షి, కాకినాడ: సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తొలినాటి నుంచి రైతు పక్షపాతినని, తమది రైతు ప్రభుత్వమని ప్రతి అంశంలోనూ నిరూపించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 13 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రైతులకు మేలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు అమలుచేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో రైతుభరోసా, వడ్డీలేని రుణాలు, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను చిత్తశుద్ధితో రైతులకు చేరువ చేశారని గుర్తుచేశారు. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు తలెత్తినా రైతులకు అందించే పథకాల్లో ఎక్కడా జాప్యం చేయకుండా అమలుచేసిన ఘనత  ముఖ్య మంత్రికే దక్కుతుందన్నారు. దివంగత వైఎస్సార్‌ జయంతి నాడు రైతు దినోత్సవం సందర్భంగా సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాలని నిర్ణయం తీసుకుని రూ.1,150 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. 

బాబువల్లే నష్టాల్లో సహకార బ్యాంకులు... 
‘సున్నావడ్డీకి ఏదీ అండా..?’ అంటూ బ్యాంకు లను తప్పుపడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం, దానివల్ల సహకార రంగం బ్యాంకులు నష్టపోయిన వాస్తవాన్ని మరుగున పరుస్తూ ఈనాడులో కథనాలను ప్రచురించారని ధ్వజమెత్తారు. అసలు సున్నావడ్డీ పథకాన్ని ఎందుకు నీరుగార్చారని ప్రశ్నించాల్సిన అప్పటి సీఎం చంద్రబాబును, టీడీపీ సర్కారును ఎక్కడా నిలదీయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సున్నావడ్డీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన 4 శాతం వడ్డీ రాయితీని ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు ప్రభుత్వం వడ్డీరాయితీ ఇస్తుందనే ఉద్దేశంతో ముందుగానే రైతులకు వడ్డీ రాయితీ కల్పించిన డీసీసీబీలు, పీఏసీఎస్‌లు ఆర్థిక ఇబ్బందులతో నష్టాల్లో కూరుకుపోయాయన్నారు.కొన్ని వాణిజ్య బ్యాంకులు సున్నావడ్డీ రాయితీని గత సర్కారు ఇవ్వడం లేదని గ్రహించి రైతులకు వడ్డీమాఫీ చేయలేదని, వారి నుంచి వడ్డీ సొమ్మును కూడా కట్టించుకున్నాయన్నారు. ఇందులో బ్యాంకులదే తప్పు అని ‘ఈనాడు’ తన కథనంలో పేర్కొన డంపై మంత్రి కన్నబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డీ రాయితీకి నిధులివ్వని చంద్రబాబు సర్కార్‌కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 

రైతులకు రూ.4 వేల కోట్ల నష్టం..
చంద్రబాబు సర్కారు ఐదేళ్ల హయాంలో మొత్తంగా రూ.4 వేల కోట్ల మేరకు రైతులు వడ్డీ రాయితీ కింద నష్టపోయారని కన్నబాబు పేర్కొన్నారు. దీనికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. 

అరకొర రుణమాఫీ వడ్డీకి చాలలేదు..
రైతు రుణమాఫీని రూ.87 వేల కోట్లనుంచి రూ. 24వేల కోట్లకు కుదించి తీరా అది కూడా చెల్లిం చకుండానే అరకొరతో చంద్రబాబు రైతులను దగా చేశారన్నారు. అరకొర రుణమాఫీ రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీలకు కూడా చాలలేదన్నారు.

1,799కోట్లకు చెల్లించింది రూ.685కోట్లే
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో పంట రుణాల పై 4 శాతం వడ్డీరాయితీ కోసం బడ్జెట్‌లో రూ. 1,799.12 కోట్లు కేటాయించి చివరకు చెల్లిం చింది కేవలం రూ.685 కోట్లు మాత్రమేనన్నారు.
 
సీఎంగా మీకు బాధ్యత గుర్తులేదా?
పాత బకాయిలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అంటున్న చంద్రబాబు 2008–09 నుంచి ఉన్న బకాయిలును ఆయన సీఎంగా వున్నప్పుడు ఎందుకు చెల్లించలేదని కన్నబాబు ప్రశ్నించారు. 2014–19 వరకు ఐదేళ్లలో ఆప్కాబ్‌ ద్వారా డీసీసీబి, సహకార సంఘాలకు రూ.689.56 కోట్లు వడ్డీరాయితీ కింద చెల్లించాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.201.76 కోట్లేనన్నారు. రూ. లక్ష లోపు వ్యవసాయ రుణం తీసుకున్నవారికి  చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ. 487.79 కోట్లు వరకు ఉందని తెలిపారు. 

నేటి నుంచి ‘ఈ–క్రాప్‌’ ప్రారంభం
రాష్ట్రంలో సోమవారం నుంచి ఈ–క్రాప్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో ఈ–క్రాప్‌ సర్వే జరుగుతుందని, పంటల ప్రణాళిక, మార్కెటింగ్‌కు అవసరమైన బేస్‌ రూపొందించేందుకు నివేదిక సిద్ధం చేస్తామన్నారు. భూ యాజమాన్య హక్కులకు నష్టం లేకుండా సీసీఆర్‌సి కార్డులు ఇచ్చేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఖరీఫ్, రబీతోపాటు మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు మూడో పంట సీజన్లకు సంబంధించి మూడు దశల్లో జరుగుతుందని తెలిపారు. 

ఇక నేరుగా రైతుల ఖాతాలకే వడ్డీ రాయితీ...
సున్నా వడ్డీ కింద రూ.1,150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడంతో పాటు అవసరమైతే ఇంకా నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారని కన్నబాబు పేర్కొన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను  పన్నెండు నెలల్లో చెల్లించాలని, దీనిపై ప్రభుత్వం వడ్డీ రాయితీని వారికి చెల్లిస్తుందన్నారు. రెండు వ్యవసాయ సీజన్లు అయిపోయిన వెంటనే వడ్డీ రాయితీని జాప్యం లేకుండా ఇచ్చేలా సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. బ్యాంకులకు ఈ సొమ్మును జమ చేయడం, సర్దుబాటు చేసే విధానానికి స్వస్తి పలుకుతూ ఇకౖపై రైతుల ఖాతాలకే నేరుగా సున్నా వడ్డీ రాయితీని ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ మార్గ దర్శకాలను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తా మన్నారు.  సున్నావడ్డీ రాని వారు ఎక్కడైనా పొరపాటు జరిగితే నేరుగా ప్రభుత్వానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 155251 ద్వారా తెలియచేసే అవకాశం ఉందని వివరించారు. 

వడ్డీ రాయితీని ఎగ్గొట్టిన టీడీపీ సర్కారు..
రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంటరుణాలను సకాలంలో చెల్లిస్తే  కేంద్రం 5 శాతం, రాష్ట్రం 4 శాతం చొప్పున మొత్తం 9 శాతం వడ్డీరాయితీ సొమ్మును భరిస్తాయన్నారు. అయితే 2014 నుంచి టీడీపీ సర్కారు ఈ వడ్డీరాయితీని బ్యాం కులకు ఇవ్వలేదని, దీనివల్ల గత ఐదేళ్లలో ఆప్కాబ్, డీసీసీబీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఈ భారాన్ని మోశాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం బ్యాంకులతో నిర్వహించే ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతు లకు ఇవ్వాల్సిన వడ్డీరాయితీపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement