35 ఏళ్లు పార్టీకి సేవ.. ఇదా బహుమానం? | Kyama Mallesh Removed From DCC Presidential Post | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుడిపై వేటు

Published Wed, Nov 21 2018 1:17 PM | Last Updated on Wed, Nov 21 2018 5:26 PM

Kyama Mallesh Removed From DCC Presidential Post - Sakshi

పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. క్రమశిక్షణ  ఉల్లంఘించలేదు.ఐదేళ్లు అధ్యక్ష పదవికి, 35 ఏళ్లు పార్టీకి సేవచేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా..

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌పై వేటు పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పార్టీపై ధిక్కారస్వరం వినిపించిన క్యామ.. టికెట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. టికెట్‌ ఇప్పిస్తామని ఆశావహుల దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాకుండా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమే ధ్యేయంగా యాదవ, కురమ సామాజికవర్గాన్ని ఏకం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. మల్లేష్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుప్రకటించింది.

అంతేగాకుండా విలేకర్ల సమావేశంలో మల్లేష్‌ చేసిన ఆరోపణలపై మంగళవారం రాత్రిలోగా సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేయనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆయనకు మరో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం టికెట్‌ ఆశించిన క్యామ మల్లేష్‌కు చుక్కెదురైంది. టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన స్క్రీనింగ్‌ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్‌ కుమారుడు సాగర్‌.. టికెట్‌ వ్యవహారంలో తన కుటుంబీకులతో జరిపిన బేరసారాలతో కూడిన సంభాషణ ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్‌గా పరిగణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మల్లేశ్‌కు ఉద్వాసన పలికారు. శుక్రవారం జిల్లాలోని మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌ పర్యటన నేపథ్యంలో మల్లేశ్‌పై వేటు వేయడం కాంగ్రెస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా, ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు మల్లేష్‌ సంజాయిషీ ఇచ్చినా వివరణ సంతృప్తికరంగా లేదని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీకి నష్టం చేకూర్చలేదు: క్యామ
పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. క్రమశిక్షణా ఉల్లంఘించలేదు. ఐదేళ్లు అధ్యక్ష పదవికీ, 35 ఏళ్లు పార్టీకి సేవకు చేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని క్యామ మల్లేశ్‌ ప్రశ్నించారు. 23 మంది బీసీలకు టికెట్లు ఇస్తే అందులో అందరికంటే తానేం తక్కువని అన్నారు. గొల్ల, కురుమ ఓట్లు అవసరం లేదని పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కుంతియా, ఉత్తమ్‌ను అడ్డగోలుగా దూషించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షోకాజ్‌తో సరిపెట్టారని, టికెట్‌ దక్కలేదని జెండా దిమ్మె, సోనియా, రాహుల్‌ ఫ్లెక్సీలను చించేసిన కార్తీక్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, బీసీని కాబట్టే తనను బలిపశువు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement