శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను కూలుస్తున్న కార్తీక్‌రెడ్డి అనుచరులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహాకూటమి పొత్తు కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. మూడు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించడంతో నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సెగ్మెంట్ల టికెట్లను ఆశించిన ముగ్గురు ఆశావహులు పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఏకంగా రాజీనామాస్త్రాన్ని సంధించగా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ టికెట్లు అమ్ముకున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆడియో టేపులను విడుదల చేసి కలకలం సృష్టించారు. టికెట్ల కేటాయింపులో యాదవులకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈనెల 17న ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ భిక్షపతియాదవ్, ఇబ్రహీంపట్నం రేసులో నిలిచిన క్యామ మల్లేశ్ ప్రకటించారు. దీంతో జిల్లాలో కూటమి కుంపటి రాజేసినట్లయింది. మరోవైపు మాజీ మంత్రి శంకర్రావు కూడా షాద్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
పార్టీకి కార్తీక్ షాక్!
మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ సీటును టీడీపీకి సర్దుబాటు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శంషాబాద్‌లో గురువారం కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన కార్తీక్.. సీటు కేటాయింపుపై పునరాలోచన చేస్తే సరేసరి.. లేకపోతే తమ రాజీనామాలు ఆమోదించినట్లుగానే భావిస్తామని హెచ్చరించారు. ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని టీడీపీకి కాంగ్రెస్ కార్యకర్తలెవ్వరూ ఓటేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలలో పీసీసీ పెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. కార్తీక్ రాజీనామా ప్రకటనతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు శంషాబాద్‌లో పార్టీ కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఫ్లెక్సీ, జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. ఈ అసమ్మతి సెగలు రాజేంద్రనగర్ రాజకీయాన్ని హాట్‌హాట్‌గా మార్చాయి. ఇదిలావుండగా, కార్తీక్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినందున.. బరిలో ఉంటారా? లేదా వేచిచూడాల్సిందే!
మూటల మాటలు బయటపెట్టిన క్యామ
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యంగా గొల్ల, కురుమలకు కేవలం ఒక సీటును కేటాయించడాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా టికెట్లను బహిరంగంగా అమ్ముకున్నారని సంచలన ప్రకటన చేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కుమారుడు టికెట్లను వేలం పెట్టారని, ఆశావహుల నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేశారని ఆరోపిస్తూ, భక్తచరణ్‌దాస్ కుమారుడు సాగర్ జరిపిన సంభాషణలుగా చెప్పుకుంటున్న ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ ముడుపుల వ్యవహారం పార్టీలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం సీటును టీడీపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. బీసీలను మోసం చేసిన పార్టీకి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు, కురుమలను ఏకం చేస్తానని హెచ్చరించారు.
రేపు నామినేషన్ వేస్తా : భిక్షపతియాదవ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును ‘దేశం’కు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న ఆయన.. అధిష్టానం వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నారు. డబ్బుల సంచులకు టికెట్‌లు పంపిణీ చేశారని పీసీసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థి మూటలకు ఆశపడి.. తనకు టికెట్ నిరాకరించారని దుయ్యబట్టారు. ఈనెల 17న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నించిన తోటకూర జంగయ్యయాదవ్ కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలావుండగా, మాజీ మంత్రి శంకర్రావు గురువారం షాద్‌నగర్‌లో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి పార్టీకి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment