సాక్షి, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్న నేతలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరోపణలతో ఆయనకు ఇటీవల షోకాజు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రాత్రిలోగా వివరణ ఇవ్వాలని ఉత్తమ్ ఆదేశించారు. లేకపోతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా...
ఉత్తమ్ ప్రకటనపై క్యామ మల్లేష్ స్పందించారు. పార్టీ అధిష్టానంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నల్గొండ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. ఎలాంటి తప్పు చేయని తనపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వనందుకు పార్టీ దిమ్మెలు పగలగొట్టిన కార్తిక్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. 35 ఏళ్లుగా ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేశానని, పార్టీ కోసం తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేశానని తెలిపారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తన సొంత డబ్బులతో పార్టీని బలోపేతం చేశానని పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని వివర్శించిన నేతలపై కాకుండా తనపై కుట్రపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీని అని ఇలా అన్యాయం చేశారని.. విధేయతతో పనిచేసిన తనకు ఇలా చేయడం బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment