సాక్షి, హైదరాబాద్: ‘2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవరి కాళ్లు పట్టుకున్నావో చెప్పాల’ని టీఆర్‌ఎస్ అధినేత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నిలదీశారు. హుస్నాబాద్ సభ తర్వాత 25 రోజులకు బయటకు వచ్చిన కేసీఆర్‌కు మతిభ్రమించి నిజామాబాద్ సభలో అడ్డదిడ్డంగా మాట్లాడారని విమర్శించారు. ఆయన చేసిన వ్యా ఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడారు. 2009 ఎన్నికల సందర్భంలో చంద్రబాబునుద్దేశించి కేసీఆర్ పొగుడుతూ మాట్లాడిన ఆడియోలను మీడియాకు వినిపించారు. చంద్రబాబుకు సంపద ఎలా సృష్టించాలో తెలుసునని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చివేశారని 2009 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ మాట్లాడారని, ఇప్పుడేమో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలం గాణ రాష్ట్రాన్ని ఇచ్చారని 2014లో సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, ఆ తర్వాత రాక్షసి అన్నాడని, కేసీఆర్ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. దొంగపాస్‌పోర్టుల దొంగబతుకు కేసీఆర్‌దని విమర్శించారు. ఉద్యమంలో ఏం మాట్లాడినా కేసీఆర్‌కు చెల్లిందని, ఇప్పుడూ చెల్లదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అరికట్టాలనే భావన ప్రజల నుంచి వచ్చినందునే మహాకూటమికి అంకురార్పణ జరిగిందని చెప్పారు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికతో కేసీఆర్ ప్యాంటు, షర్టు ఊడదీసి కొడతామని హెచ్చరించారు.
గడీల పాలనను ఓడిస్తాం: మండవ
కేసీఆర్ నాటకాలు నిజామాబాద్ ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే 2 లక్షలన్న చోట 40 వేలకు మించి జనాలు రాలేదని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. అమరావతికి వెళ్లి బిర్యాని, ఆవకాయ తిని వచ్చి, రెండు రాష్ట్రాలు కలసి పనిచేద్దామన్న కేసీఆర్, ఇప్పుడు చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా గడీల పాలనను ఓడిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment