పట్నంబజారు (గుంటూరు): చంద్రబాబు అడుగుపెడితే ఏ వ్యవస్థ అయినా సర్వనాశనం అవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అంటే దగా, మోసం, వంచన, అబద్ధమేనని దుయ్యబట్టారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎంతో విశ్వాసంతో ఉన్నారన్నారు. నవరత్నాలు ఎంతో మేలు చేస్తాయని నమ్ముతున్నారన్నారు.
రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న ఎన్నికల్లో 120 కు పైగా అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. నలభై ఏళ్ల నీచ రాజకీయ అనుభవానికి, నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిత్వానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఏపీకి ఇచ్చిన రూ.7 వేల కోట్లు శనక్కాయలు తిన్నట్లు తిన్నారని మోదీ చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని, రిలీజ్ అయితే తన బతుకు ఎక్కడ బయటపడుతుందోనని ఉలిక్కిపడుతున్నారన్నారు. చంద్రబాబు, ఆయన తొత్తు ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌ను వాడు వీడు అనటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితాన్ని ఆధారాలతో సహా బయటపెడతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment