జేడీ (యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముచ్చటిస్తున్న దృశ్యం (ఫైల్)
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి మహాగట్‌బంధన్ (మహాకూటమి)లో చేరడానికి ప్రయత్నించారని ప్రతిపక్ష ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పుస్తకంలో రాసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ‘మహాకూటమిని వీడి, ఎన్డీయేలో చేరిన ఆరు నెలలకే, తిరిగి మా దగ్గరికి రావడానికి నితీష్ కుమార్ చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన మా నమ్మకాన్ని కోల్పోయార’ని ‘గోపాల్‌గంజ్ టూ రైజినా: మై పొలిటికల్ జర్నీ’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.
జేడీ (యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీని మళ్లీ కూటమిలో చేర్చే అంశానికి సంబంధించి తనను పలుమార్లు సంప్రదించారని లాలూ పుస్తకంలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన లాలూ తనయుడు తేజస్వీ కూడా.. ఆర్జేడీ కూటమిలో తిరిగి చేరే విషయంపై తమతో మాట్లాడినట్టు తెలిపారు. గతేడాది ఈ విషయంపై తేజస్వీ మాట్లాడేతూ.. ‘ఎన్డీయేలో జేడీ (యూ) చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఆ పార్టీకి మహాకూటమిలో చోటు లేదు. వారికి కూటమిలోకి వచ్చే తలుపులను మూసేశామ’ని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. లాలూ మాటల్ని బోగస్‌గా కొట్టేసిన ఆయన.. ‘మా అధినేత (నితీష్ కుమార్) ఔచిత్యాన్ని దెబ్బతీయడానికి ఆర్జేడీ చేసిన పేలవ ప్రయత్నమిది. నేను జేడీయూలో చేరడానికి ముందు లాలూను కలిశాను. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణా వివరాలను వెల్లడిస్తే, ఆయన చిన్నబుచ్చుకోవడం ఖాయమ’ని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సీంకీర్ణ కూటమిలో దాదాపు 20 నెలలున్న తర్వాత 2017లో నితీష్‌కుమార్.. అందులోంచి బయటకు వచ్చి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment