![Laxman comments on Elections - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/16/fff.jpg.webp?itok=Cvh2AJ07)
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక, సామాజిక ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ అందాలనే అంత్యోదయ సిద్ధాంతంతో బీసీ వర్గీకరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అవినీతి బురదలో కాంగ్రెస్ కూరుకుపోయిందని, ఆ బురదను బీజేపీకి అంటించాలని రాహుల్‌గాంధీ ప్రయత్నించారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో మచ్చలేకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో మోదీ పాలిస్తున్నారని కొనియాడారు.
రాహుల్‌గాంధీ కుటుంబ పాలన గురించి మాట్లాడడం, దానికి కేసీఆర్ మా కుటుంబ పాలన, మీ కుటుంబ పాలనకంటే బాగుందని మాట్లాడడం చూస్తుంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దొందూదొందే అనేలా ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా ఈనెల 17 నుంచి 26 వరకు సామాజిక వారోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాం చందర్‌రావు, చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment