వనపర్తి బహిరంగ సభలో లక్ష్మణ్‌కు గొర్రె పిల్లను బహూకరిస్తున్న బీజేపీ నేతలు
సాక్షి, వనపర్తి: ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న సీఎం కేసీఆర్.. వాపును చూసి బలుపు అనుకుంటున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర మంగళవారం అచ్చంపేట వద్ద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంది. అచ్చంపేట, నాగర్ కర్నూ ల్ మీదుగా వనపర్తికి యాత్ర చేరుకోగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. బీజేపీలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో 100 మంది ఉన్న కౌరవ సామ్రాజ్యం లాంటి టీఆర్‌ఎస్ పార్టీని నేలకూలుస్తారన్నారు.
బీజేపీ లాంటి చిన్న పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్న కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగురీతిన బుద్ధి చెబుతామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జెండా ఎగరేస్తామన్నారు. ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి, నడిచే రైలుకు ఎదురెళ్లి బలిదానం చేసుకున్న వేణుగోపాలరెడ్డి, పార్లమెంటు సాక్షిగా బలిదానం చేసుకున్న యాదిరెడ్డి వంటి ఎందరో అమరవీరుల త్యాగం, సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించుకుంటే.. నేడు టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చి న ఏ హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. జూన్ 26వ తేదీ దేశ చరిత్రలో చీకటి దినమని, సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన రోజు అని ఆయన గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తోందన్నారు.
కేసీఆర్ గడీల రాజ్యం కూల్చుదాం
ఆమనగల్లు(కల్వకుర్తి): రాష్ట్రంలోని కేసీఆర్ గడీల రాజ్యాన్ని కూల్చుదామని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు టీఆర్‌ఎస్‌పై బీజేపీ ధర్మయుద్ధం చేస్తుందన్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రధాని మోదీ చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన జనచైతన్య యాత్ర మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చేరుకుంది. ఆమనగల్లు పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో గడీల పాలన సాగుతుందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, తెలంగాణ తెచ్చుకుంది కేసీఆ ర్ కుటుంబంలోని నలుగురికోసమేనా అని ప్ర శ్నించారు. ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైందన్నారు.
మార్పు కోసమే జనచైతన్య యాత్ర
కడ్తాల్(కల్వకుర్తి): బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు కర్షకులు, కార్మికులు అన్ని వర్గాల్లో మార్పు కోసం, వారి అభివృద్ధి సంక్షే మం కోసమే జనచైతన్య యాత్ర చేపట్టినట్లు లక్ష్మణ్ చెప్పారు. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల పాలనను చూశారని, వారి పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, 2019 ఎన్నికల్లో తమకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనచైతన్య బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి సమీపం లో జరిగిన సభలో, మహేశ్వర మహాపిరమిడ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అవినీతి పాలనపై యుద్ధం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment