శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ గడీలను కూలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు కాంగ్రెస్ కంచుకోటలు, కమ్యూనిస్టుల ఎర్ర కోటలు కూలిపోయాయని, ఇప్పుడు తెలంగాణలో గులాబీ గడీలను కూల్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. నిర్బంధాలు, ఆంక్షలతో నిజాంను తలపిస్తున్న కేసీఆర్ సర్కార్ మెడలు వంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కామారెడ్డి నుంచే ఈ మార్పు మొదలవుతుందని చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్ల పాలన నలుగురి పాలైందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు చేపట్టారని విమర్శించారు.
అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. నాలుగేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా తమపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పాలకులకు దమ్ముంటే తాము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంత మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, దీనస్థితిలో ఉన్న కులవృత్తుల వారిని ఎలా ఆదుకున్నారు, బీసీలకు ఇస్తానన్న రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది, సామాజిక న్యాయం ఎక్కడా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా మహిళలను అవహేళన చేశారని విమర్శించారు.
రామమందిరంపై మీ వైఖరేమిటి?
రామమందిర నిర్మాణంపై టీఆర్‌ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మందిర నిర్మాణం మెజారిటీ ప్రజల ఆకాంక్ష అని, దాన్ని బీజేపీ నిజం చేస్తుందన్నారు. మజ్లిస్‌కు లొంగిపోయిన సీఎం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కౌలు రైతులను అవహేళన చేసే విధంగా సీఎం మాట్లాడటం శోచనీయమన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కౌలు రైతులు, పోడు రైతులను గుర్తించి గౌరవిస్తుందని, రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తుందని లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. సామాజిక తెలంగాణ కోసం బీజేపీ పాటు పడుతుందని దీనికి ప్రజలంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు ‘చంద్ర’గ్రహణం: జీవీఎల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నాలుగేళ్లుగా ‘చంద్ర’గ్రహణం పట్టిందని, మరికొద్ది రోజుల్లో ఆ గ్రహణం వీడనుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో అభివృద్ధి అనే గంగను పారిస్తుంటే.. ఇద్దరు చంద్రులు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. వివిధ సర్వేల్లో తెలుగు రాష్ట్రాలే దేశంలో అవినీతిలో అగ్రభాగాన నిలిచాయని పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. కొడుకుల్ని సీఎంలుగా చేయాలన్న ఆరాటమే తప్ప అభివృద్ధి పట్టదని ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, వారి కలలు పీడ కలలుగా మిగులుతాయని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ప్రోత్సాహం ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి, ఆచారి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment