సాక్షి, వికారాబాద్: మూసీ నది ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని మూసీ జన్మ స్థలం వద్ద శనివారం ప్రత్యేక పూజలు చేసి ‘నమామి మూసీ’పేరిట పోరాటాన్ని ప్రారంభించారు. నదికి హారతి ఇచ్చిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, మూసీ ప్రవహించే ఐదు జిల్లాల్లో ప్రక్షాళన కార్యక్రమం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఇందులో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది కాలుష్య కాసారంగా మారిందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని నదిలోకి వదలడంతో పాటు డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. 16న బాపూఘాట్, ఆ తర్వాత సూర్యాపేటలో మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు.
శనివారం అనంతగిరిలో పుష్కరిణిలో పూజలు చేస్తున్న లక్ష్మణ్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment