ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోదండరాం తదితరులు
హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలచుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం–యూఎస్‌ఏ ఆధ్వర్యంలో 5వ ప్రవాసీ తెలంగాణ దివస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఆత్మత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఎక్కువగా ఉందని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదివిన వాళ్లు 22 లక్షల మంది ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపి, క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న 3,400 మంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకు రావాలన్నారు. తమకెవరితో శత్రుత్వం లేదని.. తెలంగాణలో అందరికీ అవకాశం, బతుకుదెరువు దొరకడమే ధ్యేయమని అన్నారు.
మరోసారి ఉద్యమ బాట పట్టాలి: రేవంత్
రాష్ట్రంలో మరోసారి ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. తుదిదశ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు కలసి రావాలని కోరారు. తెలంగాణను దాచిదాచి దయ్యాల పాలు చేశారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. అందరూ కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు. కొలువుల కోసం కొట్లాడితే హత్య చేసి, దాన్ని ఎన్‌కౌంటర్ అన్నారని విమర్శించారు. ఎన్ని రాజకీయాలున్నా అందరికీ తెలంగాణ తల్లి ఒక్కటేనని ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం దేశంలోని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె. ప్రభాకర్, యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ ఆనందసాయి, రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment