సాక్షి, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇటీవల వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన నారాయణగురు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ‘దేశంలో కొన్ని కులాలే అధికారం చలాయిస్తున్నా’యంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా ఆదివారం బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బడుగు, బలహీనవర్గాలకు రేవంత్‌రెడ్డి బలమైన వెన్నుపూస, చేతికర్రగా మారారు. తెల్లబట్టల నేతలకు అమ్ముడుపోవద్దు’అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ‘తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ అన్న పాత్ర ఎవరూ కాదనలేనిది. సమైఖ్య పాలనలో ఆయనపై దాడిచేసిన అధికారులకు కీలక బాధ్యతలిచ్చారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల బిడ్డను గుర్తింపులేకుండా పక్కనపెట్టారు’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
డిప్యూటీ స్పీకర్‌తో మంత్రి భేటీ
సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదికగా రేవంత్‌రెడ్డి, స్వామిగౌడ్ పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గౌడ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించినా, స్వామిగౌడ్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.
పార్టీ కార్యకలాపాలకు దూరంగా..
గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన స్వామిగౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment