
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నిరసన వెళ్లగక్కారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా... మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నారు. తాజాగా.. టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మానుకొండ రాధకిశోర్ అనుచరులు, కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. బల్లేపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధార్యమని అన్నారు. ఈ నెల 19న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఖమ్మం స్థానానికి నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కష్టపడి పనిచేసేవారికి కాంగ్రెస్‌లో టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.
సెల్ టవర్ ఎక్కి ఆందోళన
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై దయాకర్ అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుమలగిరి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దయాకర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువయుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. దయాకర్‌కు టికెట్ కన్ఫామ్ అయ్యేంతరకు టవర్ దిగేది లేదని హెచ్చరిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కామారెడ్డిలో...
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజేంద్రనగర్‌లో..
తనకు టిక్కెట్ రాకపోడంతో పార్టీ కార్యాలయంలో కార్తీక్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మను సుత్తితో కొట్టి ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు, జెండాలు చించివేశారు. రాజేంద్రనగర్‌లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజీనామా చేస్తారని హెచ్చరించారు. టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment