
శాసనసభ ఉపాధ్యక్షుడు శివశంకరరెడ్డి
సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి శ్రీమంతుల కొమ్ము కాస్తోందని శాసనసభ ఉపాధ్యక్షుడు శివశంకరరెడ్డి విమర్శించారు. గుడిబండ తాలూకా ఆదినారాయణ స్వామి సన్నిధిలో శనివారం ఏర్పాటు చేసిన విజయ వాహిని ప్రచార రథ యాత్రను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మోదీ అసత్యాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.
నోట్ల రద్దుతో ధనవంతులే బాగుపడ్డారన్నారు. ఇంధన ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుగుతోందన్నారు. తాలూకాలో 20ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. 1500 మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు గీతా జయందర్, నగరసభ అధ్యక్షుడు కలీంవుల్లా, తదితరులు పాల్గొన్నారు.