
లాలూ పాత మిత్రుడు, ప్రస్తుత రాజకీయ శత్రువు అయిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాగా వెనుకబడిన బీసీలు, దళితులను ఉద్ధరించే విధానాలు అమలు చేశారు. అదే సమయంలో లాలూ కాలంలో అధికార పీఠాలకు దూరమైన అగ్రవర్ణాల ఆదరాభిమానాలు కూడా ఆయన సంపాదించగలిగారు. ఆయన పార్టీ జేడీయూ ఆయనలా ఉత్సాహంతో పనిచేస్తుండగా, లాలూ పార్టీ నీరసించి ఉంది. లాలూ జైల్లో ఉండడంతో ఆయన కుటుంబంలో కలతలు పెరిగాయి. కొడుకులిద్దరి మధ్య సఖ్యత లేదు. పెద్ద కూతురికి చిన్న తమ్ముడు తేజస్వితో పడదు. ఈ పరిస్థితుల్లో కూడా మహాకూటమికి ఆర్జేడీ నాయకత్వం వహించడం సాధారణ విషయమేమీ కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జేడీ తన ఎన్నికల ప్రచారంలో కొత్త విషయాలుగాని, విజయాల గురించిగాని చెప్పడం లేదు. తొలి ఆరేడేళ్ల పాలనలో కింది కులాలకు గ్రామీణ ప్రాంతాల్లో మేలు ఎంతగా జరిగిందో పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.
గ్రామీణ ప్రజలు కూడా గణనీయ సంఖ్యలో ఈ విషయాలు నిజమేనని అంగీకరిస్తూ లాలూ గురించి అభిమానంతో మాట్లాడుతున్నారు. అగ్రకులమైన భూమిహార్ల పొలాల్లో పనిచేయడానికి వెళ్లిన దళితుల దినసరి కూలీ చాలా తక్కువనీ, వారిని చెప్పులు వేసుకోనిచ్చేవారు కాదనీ, లాలూ సీఎంగా ఉండగా పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగైందని కొన్ని గ్రామాల్లో మహిళలు గుర్తుచేసుకుంటున్నారు. ఇద్దరు మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ్ మిశ్రాలకు ఒకే కేసులో శిక్షలు పడినాగాని, మిశ్రా బెయిలుపై తిరుగుతుండగా, లాలూను జైలుకే పరిమితం చేశారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిశ్రా అగ్రవర్ణ కుటుంబంలో పుట్టడం, లాలూ బీసీ కావడమే ఈ వివక్షకు కారణమని వారు చెబుతున్నారు. మొత్తంమీద లాలూ మీద ప్రజానీకంలో ఉన్న అభిమానం మహా కూటమిని ఏ మేరకు ఎన్నికల్లో ముందుకు నడిపిస్తుందో రాజకీయ విశ్లేషకులు అంచనావేయలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో సైతం మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కొని ఆర్జేడీ 20 శాతం వరకు ఓట్లు సాధించినా ఈసారి ఎలా తన ఉనికిని కాపాడుకుంటుందో చెప్పడం కష్టం.
Comments
Please login to add a commentAdd a comment