
బొట్టుపెట్టి ప్రచారం నిర్వహిస్తున్న సమభావన సంఘాల సభ్యులు
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ‘ఉండమ్మా.. బొట్టుపెడుతా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలింగ్ జరిగే 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు మించి..
డిసెంబర్‌లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.95శాతం ఓటింగ్ నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. ఈనెల 11న జరిగే పార్లమెం ట్ ఎన్నికల్లో అంతకుమించి ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల యంత్రాంగం పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ 20 పోలిం గ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిం ది. ప్రధానంగా భువనగిరి వంటి పట్టణ ప్రాం తాల్లో పోలింగ్ శాతం తగ్గడంతో వాటిపై యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 20 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ‘ఉం డమ్మా.. బొట్టుపెడతా..’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమభావన సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓటు వేయాలని కోరుతున్నారు.
వేసవి ప్రభావం పడకుండా..
అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లాలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. పార్టీల ప్రచారం ఆ స్థాయిలో లేకపోవడంతో పాటు ఎం డ తీవ్రత కూడా ఓటర్లపై ప్రభావం చూపనుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో ఓటింగ్ శాతం తగ్గకుండా ఉండేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో సమభావన సంఘాల సభ్యులతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మానవహారాలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఓటర్లు ఓటు వేయడమే కాకుండా ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తానని శపథం, ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. అలాగే పోలింగ్ రోజున ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని జోరుగా ప్రచారం చేపడుతున్నారు.
పోలింగ్ శాతం పెంపు కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెట్రోల్‌బంక్‌లు, ప్రభు త్వ స్థలాల్లో ఓటరు చైతన్యంపై కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేశారు. మార్నింగ్ వాక్, 2 కె, 3 కె రన్‌లు నిర్వహిస్తున్నారు.
కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు ఓటరు స్లిప్‌లతో పాటు ఓటరు కరదీపికలను అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను జారీ చేశారు. అదే విధంగా దివ్యాంగ ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేసిన అనంతరం తిరిగి ఇంటి వద్దకు చేర్చడానికి వాహనాలను సమకూరుస్తున్నారు. అంతేకాకుండా వీరికి సహాయకులుగా వలంటీర్లను నిమిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ర్యాంప్‌లో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment