► మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు వరకు 61.31 శాతం పోలింగ్ నమైదయింది.
► మహారాష్ట్రలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడోదశలో పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ నటి రేణూదేశాయ్ పూణెలోని ఖోత్రోడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
► ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్ర బారామతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముర్షీదాబాద్ రానీనగర్ ప్రాంతంలోని 27, 28 నంబర్ పోలింగ్ బూత్‌ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
► మధ్యాహ్నం మూడు గంటల వరకు అస్సాంలో 62.13 శాతం, బిహార్‌లో 46.94 శాతం, గోవాలో 58.55 శాతం, గుజరాత్‌లో 50.36 శాతం, కశ్మీర్‌లో 10.64 శాతం, కర్ణాటకలో 49.96 శాతం, కేరళలో 55.05 శాతం, మహారాష్ట్రలో 44.70 శాతం, ఒడిశాలో 46.70, త్రిపూరలో 61.38 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.99 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 67.52 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 55.29 శాతం, దాద్రానగర్ హవేలీలో 56.81 శాతం, డామన్ అండ్ డయ్యూలో 55.02 శాతం పోలింగ్ నమోదైంది.
► ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ గుజరాత్‌లోని ఉంజా పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మోదీ దేశానికి ఎంతో చేశారని.. ఇంకెంతో చేస్తారని అన్నారు.
► ఒడిశాలోని దెంకనల్‌లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న అధికారి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.
► కేరళ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మణి అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఇద్దరు వృద్ధులు చనిపోయారు. తలిపరంబాలో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న 72 ఏళ్ల వేణుగోపాల మరార్ అస్వస్థతకు లోనై మరణించారు.
► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాంలోని దిస్పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
► పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పియార్యుల్ అనే ఓటర్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
► బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
► ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
►పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. కేరళలో కన్నూర్ జిల్లాలో ఓ పోలింగ్ బూత్‌లో అకస్మాత్తుగా ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఓటర్లు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. పామును పట్టుకున్న తరువాత పోలింగ్ సజావుగా సాగుతోంది.
►సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైఫైలోని పోలింగ్‌బూత్‌లో వారు ఓటు వేశారు. భారత క్రికెటర్ చతేశ్వర పుజారా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు.
►ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బగేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని, వారికి చెప్పాల్సింది చెప్పామని ప్రస్తుతం ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
►ఉదయం 11 గంటలకు వరకు నమోదైన పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్(23.85) మొదటి స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ వివరాలు (శాతాల్లో).. బీహార్ 20.80, గుజరాత్ 13.24, జమ్మూ కాశ్మీర్ 3.39, కర్ణాటక 12.72, కేరళ 21.09, మహారాష్ట్ర 9.03, ఒడిశా 8.67, త్రిపుర 15.28, ఉత్తరప్రదేశ్ 16.18, ఛత్తీస్‌ఘడ్ 19.31, దాద్రానగర్ హవేలి 11.40, డామన్ డయ్యూ 19.43
►కాంగ్రెస్ సీనియర్ నేత, గుల్బర్గ ఎంపీ అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు హార్థిక్‌పటేల్ ఓటు వేశారు. సురేంద్రనగర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మలయాళ సూపర్‌స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు కూడా ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముట్టి , తిరువనంతపురంలో మోహన్‌లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
►సామాజిక కార్యకర్త అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు.
►వయనాడ్‌లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పోటీచేయడంతో అందరి దృష్టి వయనాడ్‌పై పడింది.
►దేశ వ్యాప్తంగా 14రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు.. బిహార్‌లో 9.35, కర్ణాటకలో 6.02, అసోంలో 12.36, గోవాలో 9.30, గుజరాత్‌లో 6.76, కేరళలో 6.57, మహారాష్ట్రలో 3.79, ఒడిశాలో 4.98, త్రిపురలో 4.28, యూపీలో 9.80, బెంగాల్‌లో 16.23, ఛత్తీస్‌ఘడ్‌లో 9.59 శాతం నమోదైంది.
►ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. రాయిసన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు శశిథరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
►ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటును వేశారు. ములాయం సింగ్ సోదరుడు అభయ్ సింగ్ యాదవ్.. మణిపురి నియోజకవర్గంలోని సైఫైలో ఓటు వేశారు.
►బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన సతీమణి సొనాల్ షాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయి గ్రామంలో ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేశారు.
►వికలాంగులు, ముసలివాళ్లు అందరూ పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటుండగా.. నవ వధూవరులు సైతం ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద వీరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
►గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి అంజలితో కలిసి రాజ్‌కోట్‌లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో ఓటు వేశారు. కేరళ గవర్నర్ పి. సదాశివం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశాలోని తాల్చేర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓటు వేశారు.
►గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి సఖాలి నియోజకవర్గంలో ఓటు వేశారు. భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అపరాజితా సారంగి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐఆర్‌సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
►ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్ పోలింగ్ కేంద్రంలో క్యూలైనులో నిలబడి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలిగిందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశసించారు.
►కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్నారు.
►ప్రధాని నరేంద్రమోదీ నేడు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాసేపటి క్రితమే గాంధీనగర్‌లోని తన తల్లి ఇంటికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. బీహార్‌లోని సుపాల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 151 బూత్ నెంబర్‌లో నిర్వహించిన మాక్‌పోలింగ్‌లో ఈవీఎం మొరాయించడంతో.. ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.
►పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మహారాష్ట్రలోని ఓ సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించేందుకు వీల్‌చైర్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చారు. పుణేలోని మేయర్ కాలనీలోని బూత్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ పెద్దాయనకు సహాయం చేశారు. ఎన్నికల్లో తమకు విజయం చేకూరాలని కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప, బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ పూజలు నిర్వహించారు. షిమోగ జిల్లాలోని శికాయిపురాకు చెందిన హుచార్య దేవాలయాన్ని యాడ్యూరప్ప సందర్శించగా.. కాలాబురాగిలోని శరణ బసవేశ్వరాలయాన్ని బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
►దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేడు 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుజరాత్(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్(7), ఒడిశా(6), బిహార్ (5), బెంగాల్(5), గోవా(2), దాద్రనగర్ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment