
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పోటీగా ఎన్డీయే తరఫున తుషార్ వెల్లప్పల్లిని బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. కేరళలో బీజేపీకి మిత్ర పక్షమైన భారత్ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. తుషార్‌ను తమ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని సగర్వంగా ప్రకటిస్తున్నామని అన్నారు. ఆయనొక డైనమిక్ లీడర్ అని ప్రశంసించారు. తమ పార్టీ నినాదాలైన అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తుషార్ నాయకత్వంలో తమ పార్టీ కేరళ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కేరళలో ఉన్న ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగమ్’అనే సంస్థ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేషన్ కుమారుడే తుషార్. కేరళలో సుప్రసిద్ధుడైన నటేషన్.. వెనుకబడిన కులాల్లో ఒకటైన ఇజవాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నారు.
రేపు కోజికోఢ్‌కు రాహుల్
వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ గురువారం (4న) నామినేషన్ దాఖలు చేయనున్నారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీ వెల్లడించారు. రాహుల్ బుధవారం కోజికోడ్‌కు రానున్నారని ఆయన తెలిపారు. మరుసటి రోజు నామినేషన్ సమర్పించే ముందు రాహుల్ రోడ్‌షో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాహుల్ ఓటమే లక్ష్యం
వయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) పావులు కదుపుతోంది. సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ సీపీఐ నేత డి.రాజాను సోమవారం ఢిల్లీలో కలిశారు. రాజా మీడియాతో మాట్లాడుతూ.. వయనాడ్‌లో రాహుల్‌ను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ఉద్ఘాటించారు. కాగా, రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు ఈ నెల 3న రాజా వయనాడ్ రానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో కారత్ కూడా వయనాడ్ వెళ్లి అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది.