
అమేథీ/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ పేర్కొంది. వీటిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్‌లాల్ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. ఈ అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ లాయర్ సోమవారం వరకు గడువు కోరారని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment