వయనాడ్ కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న రాహుల్. పక్కన ప్రియాంక గాంధీ
కాల్పెట్టా(కేరళ): ‘ భారత దేశమంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వడానికే కేరళ నుంచి పోటీ చేస్తున్నా. తమ సంస్కృతి, ఆచారాలపై ఆరెస్సెస్–బీజేపీలు దాడికి పాల్పడుతున్నాయని దక్షిణాది ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. అందుకే ఉత్తర, దక్షిణ భారత్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నా’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలో ఆ పార్టీ కంచుకోట అయిన వయనాడ్ నుంచి ఆయన పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్ తదితరులు వెంటరాగా రాహుల్ గురువారం వయనాడ్ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కల్పెట్టా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడి హంగామా సృష్టించారు. రాహుల్‌ను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన అభిమానులతో కాల్పెట్టా పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన తరువాత రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నాయకులు రోడ్ షో నిర్వహించారు.
విమర్శలను సంతోషంగా స్వీకరిస్తా..
వయనాడ్ నుంచి తాను పోటీచేయడం పట్ల సీపీఎం చేస్తున్న విమర్శల్ని స్వీకరిస్తానని, ప్రచారం సందర్భంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడనని అన్నారు. ‘కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు రాజకీయ ప్రత్యర్థులు. ఇరు పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది. సీపీఎం నన్ను ఢీకొనబోతున్న సంగతిని అర్థం చేసుకోగలను. కానీ వారికి వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. సీపీఎం చేసే ఎలాంటి ఆరోపణలు, విమర్శలనైనా సంతోషంగా స్వీకరిస్తా’ అని నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత విలేకర్ల సమావేశంలో రాహుల్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఐదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయని అన్నారు. ‘ రైతులకు భవిష్యత్‌పై నమ్మకం పోయింది. యువకులు ఉద్యోగ అన్వేషణలో రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ రెండు విషయాల్లో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. చౌకీదార్‌గా ఉంటానన్న మోదీనే రూ.30 వేల కోట్లను వైమానిక దళం నుంచి దొంగిలించి అనిల్ అంబానీకి ధారాదత్తం చేశారు’ అని వివాదాస్పద రఫేల్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ఆరోపించారు.
వయనాడ్..రాహుల్ జాగ్రత్త: ప్రియాంక
తనకు తెలిసిన వారిలో రాహుల్ గాంధీనే అత్యంత ధైర్యశీలి అని ప్రియంక గాంధీ అన్నారు. తన సోదరుడిని జాగ్రత్తగా చూసుకోవాలని వయనాడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వయనాడ్..నా సోదరుడిని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆశల్ని వమ్ము కానీయడు’ అని ప్రియంక ట్వీట్ చేశారు.
వయనాడ్‌తో రాహుల్‌కు సంబంధం..
రాహుల్‌కు వయనాడ్‌తో అవినాభావ సంబంధం ఉంది. 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత అస్థికల్ని రాహుల్ ఇక్కడి పాపనాశిని అనే నదిలో నిమజ్జనం చేశారని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత రమేశ్ చెన్నితాలా గుర్తుకుచేసుకున్నారు. ప్రకృతి సోయగాల మధ్య తిరునెల్లి గ్రామంలో నెలవైన మహావిష్ణు ఆలయానికి ఈ నది అనుసంధానమై ఉంది.
రాహుల్ ఆస్తులు రూ.15.88 కోట్లు
తనకు రూ.15.88 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో రాహుల్ పేర్కొన్నారు. సొంతకారు లేదని, బ్యాంకుల నుంచి రూ.72 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలిపారు. చరాస్తుల విలువ రూ.5.80 కోట్లు, స్థిరాస్తుల విలువ 10.08 కోట్లని వెల్లడించారు. చేతిలో రూ.40 వేల నగదు, బ్యాంకుల్లో రూ. 17.93 లక్షల మేర నిల్వలు ఉన్నట్లు తెలిపారు. బాండ్లు, షేర్లు, డిబెంచర్లలో రూ.5.19 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఎంపీగా వేతనం, రాయల్టీ, అద్దె, పెట్టుబడులపై వస్తున్న వడ్డీ తదితరాలు తన ఆదాయ వనరులని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు, జార్ఖండ్, అస్సాం, ఢిల్లీలో ఒకటి చొప్పున తనపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 1995లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్(డెవలప్‌మెంట్ స్టడీస్) చేశానని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ ఆస్తులను రూ.9.4 కోట్లుగా చూపారు.
మిల్మా బూత్.. అమూల్ బాయ్!
రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత వయనాడ్‌లో మిల్మా బూ™Œ æ(కేరళ ప్రభుత్వ పాల ఉత్పత్తుల బ్రాండ్) దుకాణం మీదుగా సాగుతున్న కాంగ్రెస్ ర్యాలీ. వయనాడ్‌లో పోటీచేస్తానని ప్రకటించగానే రాహుల్‌ను కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ ‘అమూల్ బాయ్’గా అభివర్ణించిన నేపథ్యంలో తాజాగా పాల దుకాణం పక్క నుంచే రాహుల్ ర్యాలీ కొనసాగడం యాదృచ్ఛికమే. గుజరాత్‌లో ప్రఖ్యాతిగాంచిన ‘అమూల్’ మిల్క్ బ్రాండ్ సృష్టికర్త వర్గీస్ కురియన్ కూడా కేరళకు చెందిన వ్యక్తే. అమూల్ స్ఫూర్తితోనే మిల్మా బ్రాండ్‌ను కేరళలో ప్రారంభించారు.
అమేథీని అవమానించారు
అమేథీ/లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకోవడమంటే అమేథీకి అవమానమేనని, అక్కడి ప్రజలను మోసం చేయడమేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అమేథీ నుంచి స్మృతి బరిలో ఉన్నారు. రాముడు వనవాసం 14 ఏళ్లు చేయగా.. అమేథీ ప్రజలు 15 ఏళ్లుగా వనవాసం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం పర్సాద్‌పూర్‌లో ఆమె ప్రచారం చేశారు.
‘వయనాడ్’ పోటీ సంకుచిత నిర్ణయం
వయనాడ్: రాహుల్‌ను అమేథీతోపాటు వయనాడ్ నుంచి కాంగ్రెస్ పోటీకి దింపడం ఒక సంకుచిత నిర్ణయం అని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. వామపక్షాల తరపున వయనాడ్ నుంచి పోటీ పడుతున్న పీపీ సునీర్‌ను బరిలో నుంచి తప్పించే అవకాశమే లేదని చెప్పారు. దేశ ఐక్యత కోసం వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్..కశ్మీర్, లక్షద్వీప్ వంటి చోట్ల పోటీచేయాలని హితవు పలికారు. హిందువులు ఎక్కువగా లేని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని మోదీ విమర్శించినందుకే రాహుల్ అమేథీ నుంచి దూరంగా పారిపోయారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment