
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దక్షిణాది నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు పోటీగా బీజేపీ తుషార్ వెల్లపల్లిని నిలబెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కేరళలో బీజేపీకి మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేన పార్టీ నుంచి తుషార్ వెల్లపల్లి పోటీ చేయనున్నారు.
‘భారత్ ధర్మ జనసేన నేత తుషార్ వెల్లప్పల్లి వయనాడ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను. ఆయన యంగ్ అండ్ డైనమిక్ లీడర్. బీజేపీ నినాదాలైన అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాం. కేరళ రాజకీయాల్లో ఎన్డీయే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.