
లోకేష్ ఇతర దేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి కాదు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మైకు ముందు మాట్లాడితే దొరికిపోతాడు కాబట్టే ట్విటర్‌లో పోస్టులు పెడుతూ.. చివరకు ట్విటర్ పక్షిగా మారిపోయాడని వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ బాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో జతకట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాడు రాహుల్ గోబ్యాక్ అన్నారని, నేడు చంద్రబాబు, రాహుల్‌తో జతకట్టి మోదీ గోబ్యాక్ అంటున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో యుద్ధం చేస్తారంటూ లోకేష్ అంటున్నారని, యుద్ధం చేసేది ఎక్కడ.. టీడీపీ నేత ఒక్కరన్నా మోదీని అడ్డుకునే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రత్యేకహోదా గురించి ఎవరు పోరాడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు.
హోదా సజీవంగా బతికుందంటే అది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లనేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ జరిపితే సింగపూర్, మలేషియా ఇతర దేశాలకు పారిపోతారని, లేదా జైళ్లకు వెళ్తారన్నారు. లోకేష్ ఇతర దేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి కాదు.. తెలుగు నేర్చుకోవడం కోసమేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. చంద్రబాబు..మోదీతో జతకట్టి రేపు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని అన్నారు.