సాక్షి, అనంతపురం సెంట్రల్: టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక మద్యం వ్యాపారానికి గేట్లు తెరిచింది. అప్పటి వరకు ఉన్న మద్యం దుకాణాలు, బార్‌లు కాదని అదనంగా కొత్తవాటిని మంజూరు చేశారు. జిల్లా కేంద్రం మొత్తానికి రెండు మాత్రమే బార్లు ఉండగా టీడీపీ సర్కార్ వాటికి సంఖ్యను పదికి పెంచింది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఆరు మాత్రమే ఉండగా ప్రస్తుతం 32 బార్లు తెరిచారు. దీన్ని బట్టి చూస్తే మద్యంను ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చేశారో అర్థం చేసుకోవచ్చు. పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసి ఆదాయంపైనే మక్కువ చూపుతున్నారు.
ఎమ్మార్పీకి తూట్లు
జిల్లాలో మద్యం దొరకని గ్రామమంటూ లేదంటే అతిశయక్తి కాదు. ఎక్కడ చూసిన మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుపుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం మద్యం విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా ఎమ్మార్పీపై అదనంగా రూ. 10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు మొత్తం సిండికేట్‌గా మారి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో మద్యంబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతి నెలా దాదాపు రూ.100కోట్లకు పైగా అధికారికంగా విక్రయాలు జరుపుతుంటే అదనంగా వచ్చే మొత్తంతో రూ. 5కోట్లకు పైగా ఉంటోందని లెక్కలు తేలుస్తున్నారు. ఈ విషయం అధికారులందరికీ తెలిసినా కూడా పెద్దగా దృష్టి సారిస్తున్న పాపాన పోలేదు.
కర్ణాటక మద్యం దిగుమతి
ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక మద్యం కూడా దిగుమతి అవుతుండడం గమనార్హం. ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి(మార్చి 10) నుంచి అధికారుల దాడుల్లో రూ. 1.11 కోట్లు విలువైన మద్యం సీజ్ చేశారు. అనధికారికంగా మద్యం నిల్వ ఉంచుకున్న నగరంలోని ఓ బార్‌ను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం దిగుమతిపై 34 కేసులు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో 179 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇదంతా అధికారులు చేపట్టిన దాడుల్లో వెలుగుచూసిన అంశాలు. కానీ ఇంతకు పదింతలు రెట్టింపులో మద్యం విక్రయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి మద్యం విక్రయాలు పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
జగన్ నిర్ణయంపై మహిళల హర్షం
టీడీపీ అధినేత చంద్రబాబు మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా బార్, మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూంలు పెంచి మద్యం విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెల్టుషాపుల నిషేధిస్తామని ప్రకటించడంతో బాబు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే పకడ్బందీగా అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిగ్రామంలో బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో, అనంతరం మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలను తొలగిస్తారు. దీని వలన విచ్చలవిడి మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుంది. మద్యం తాగాలంటే కనీసం 10 నుంచి రూ. 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప దొరకని పరిస్థితి కల్పించడం జరుగుతుంది. దీంతో మద్యం బాబులు కొంత వరకు గాడిలో పడతారు. దశల వారీగా మద్యం దుకాణాలు తొలగిస్తే పేదల బతుకులు బాగుపడుతాయని ఆశిస్తున్నారు.
గత మూడు నెలల్లో మద్యం విక్రయాలు ..
నెల | జరిగిన విక్రయాలు |
జనవరి | రూ. 107 కోట్లు |
ఫిబ్రవరి | రూ. 108 కోట్లు |
మార్చి | రూ. 103 కోట్లు |
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో రూ.కోట్లలో ఆదాయం
ఓ వైపు మద్యం విచ్చల విడిగా తాపుతూనే.. మరో వైపు జరిమానాలతో మద్యం బాబుల నుంచి రూ.కోట్లలో వసూలు చే స్తున్నారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి నుంచి పోలీసులు జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అనంతపురంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో మాత్రమే ఏడాదికి 2వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. అనంతపురం ట్రాఫిక్‌పోలీసు స్టేషన్ పరిధిలో 2017లో 2132 కేసులు, 2018లో 2432 కేసులు, 2019లో ఇప్పటి వరకూ 579 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. జరిమానాలు కోర్టులో చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కొక్కరి నుంచి రూ. 1500 నుంచి రూ. 2000 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. సరాసరిన రూ.35 లక్షలకు పైగా డ్రంక్ డ్రైవ్ నుంచి ఆదాయం సమకూరుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్‌ల పరిధిలో రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించేది ప్రభుత్వమే... తాగి రోడ్లపైకి రాకూడదనే ఆంక్షలు పెట్టేది ప్రభుత్వమేనని ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విచ్చల విడి మద్యం అమ్మకాల వలన అతిగా మద్యం తాగి మృతి చెందిన వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు వందలో ఉన్నారు.
బెల్ట్ షాపులతో ఇబ్బంది
ఊరి మధ్యలో బెల్ట్ షాపులుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండకుండా చర్యలు తీసుకుంటామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
– రాజు, ఇనగలూరు, అగళి మండలం
మద్యంతో అన్నీ అనర్థాలే ..
మద్యం షాపుల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. మద్యం తాగడానికి వచ్చిన వారు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జగనన్న విడతల వారీగా మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చాడు. ఈ హామీని స్వాగతిస్తున్నాం. మద్యానికి బానిసలైన వారు తమ కుటుంబ సభ్యులను డబ్బుల కోసం వేధించడమే కాకుండా ప్రతి రోజు ఇంట్లో గొడవపడుతుంటారు. మద్యపానం నిషేధిస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటారు. – తిప్పేస్వామి, మోరుబాగల్, గుడిబండ
చెక్‌పోస్టుల ద్వారా నిఘా
ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం దిగుమతి కాకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఆరు శాశ్వత చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా సరిహద్దులో తాత్కాలికంగా 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నాం. ఇదే కాకుండా బెల్టుషాపులు, నాటు సారా వాటిపై ఉక్కుపాదం మోపుతున్నాం. మద్యం విక్రయాలపై ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా 0866–2428333, 18004254868 టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశాం. – టి. విజయ్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్
Comments
Please login to add a commentAdd a comment