సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం గౌడ కులస్తులను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి డి.కె.అరుణ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా గౌడ సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్వీకరించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే సినిమా రంగం వాళ్లతో తన కుమారుడు కేటీఆర్‌కు సంబంధాలున్నాయనే డ్రగ్స్ జోలికి కేసీఆర్ వెళ్లడం లేదని ఆరోపించారు. కేటీఆర్‌కు పబ్‌లు, క్లబ్‌లలో వాటా ఉంది నిజం కాదా? అని ప్రశ్నించారు. గౌడ కులస్తులను అణచివేస్తున్నారని, కల్తీ కల్లు పేరుతో ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
గీత కార్మికులకు కనీసం ఎక్స్‌గ్రేషియా రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. కులాల పేరిట విద్యార్థులను కూడా కేసీఆర్ విభజిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పేరిట విడగొడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కల్లు, గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేలా మేనిఫెస్టోలో చేర్చుతామని తెలిపారు. అందరినీ మోసం చేస్తున్న పాపాత్ముని పాలన త్వరలోనే అంతం కాబోతుందని యాష్కీ జోస్యం చెప్పారు.
కులాలను చీల్చాలని చూస్తున్నారు: డీకే
ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కులాలను చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. గౌడేతర కులాలకు కూడా టీఎఫ్‌టీ లైసెన్సులు ఇస్తున్నారని, అన్ని కులాల భవనాలకు వందల జీవోలు వచ్చాయి కానీ ఏ కులానికీ భవనాలను నిర్మించలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ హామీలను చూశాం.. మోసాలను చూశాం.. ఇక చాలు అంతా కలిసి కాంగ్రెస్‌కి అండగా ఉండాలని కోరారు. గీత కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment