
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కొనసాగుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కొనసాగుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పేశారు. తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేనని అధినేత వద్ద ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయమని తనను బలవంతం పెట్టొద్దని చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు మాగంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్‌ను వ్యక్తిగతంగా కలిశానని, తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మాగుంట చెప్పడం విశేషం.
కాగా ఇప్పటికే అధికార పార్టీ పలు జిల్లాల్లో పార్లమెంట్ అభ్యర్థుల కోసం భూతద్దంతో అన్వేషణ సాగిస్తోంది. ముఖ్యంగా నెల రోజులుగా అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆశించే స్థాయి నేత దొరక్కపోవడం, ఆయా స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. నెల రోజులుగా పార్టీలో వేగంగా సమీకరణాలు మారిన క్రమంలో నేతలు అందరూ అసెంబ్లీకే మొగ్గు చూపడంతో పార్లమెంట్‌కు అభ్యర్థి సమీప దూరాల్లో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఆయా సామాజిక వర్గంలో నేతలు ముందుకు రాకపోవడంతో పార్టీ ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారు.