సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీపావళి పండుగ (అక్టోబర్ 27వ తేదీ)కు ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం.
మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే దఫా నోటిఫికేషన్ విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది.
కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తుపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీతో పొత్తుకు శివసేన సిద్ధంగానే ఉన్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని శివసేన శ్రేణులకు అధినేత ఉద్ధవ్ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment