
ముంబై : రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం (అక్టోబర్) నాడు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్లీ నియోజకవర్గ ఎన్సీపీ అభ్యర్థి ధనంజయ్ ముండేపై శనివారం రాత్రి కేసు నమోదైంది. తన కజిన్, బీజేపీ అభ్యర్థి పంకజ ముండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై బీజేపీ నేత జుగల్ కిశోర్ లోహియా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 17న కేజ్ తాలుకాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పంకజ ముండేపై ధనంజయ్ అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులకు సమర్పించారు.
వీడియోను పరిశీలించిన పోలీసులు ధనంజయపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్, మహిళా కమిషన్‌కుకూడా ఫిర్యాదు చేశామని లోహియా వెల్లడించారు. ఇక ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం. పంజక ముండే దివంగత గోపినాథ్ ముండే కూతురు అనే విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు.
కాగా, తనపై అక్రమంగా కేసు పెట్టారని, వీడియోను ఎడిట్ చేసి తన వ్యాఖ్యలను తప్పుగా చూపెట్టారని ధనంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఇంతటి జుగుప్సాకర రీతిలో చిచ్చు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో అంతా ఫేక్ అని, కావాలంటే దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలని డిమాండ్ చేశాడు. ఓటమి భయంతోనే ప్రత్యర్థి పక్షం తనపై క్షక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment