సాక్షి ముంబై : శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా శివసేన చీఫ్ ఉద్ధవ్ మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకుండా మరెలాంటి ఎన్నికలూ లేకపోవడంతో ఈ దఫా ఎమ్మెల్సీగా శాసనమండలికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో శివసేన నుంచి ఎమ్మెల్సీగా నీలం గోర్హే పదవీ కాలం ముగియనుండటంతో ఆ స్థానంలో శివసేన అధినేత మండలికి వెళ్లు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
26 మంది విరమణ..
నూతన సంవత్సరంలో శాసన మండలిలోని 26 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ సభ్యులలో 10 మంది ఎన్సీపీకి చెందినవారే ఉన్నారు. దీంతో నూతన సంవత్సరంలో జరగబోయే శాసన మండలి ఎన్నికలపై అందిరి దృష్టి కేంద్రికృమైంది. అయితే బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి మహావికాస్ ఆఘాడి ఏర్పాటవడంతో మెజార్టీ మహాఆఘాడికే ఉంది. దీంతో మహావికాస్ ఆఘా డికి నూతన సభ్యుల ఎన్నికలో పెద్దగా ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. శాసన మండలిలోని 78 మంది సభ్యులలో 26 మంది పదవీకాలం ముగియనుండగా వీరిలో ఎన్సీపీకి చెందిన పది మంది, కాంగ్రెస్ ఏడుగురు, బీజేపీ ఐదుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులుండగా శివసేన, పీఫుల్స్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక్కో సభ్యుడున్నారు.
కూటమికి బలం ఉండటంతో..
శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే నేపథ్యంలో ఆరు నెలల లోపు శాసన సభ లేదా శాసన మండలి సభ్యత్వం పొందాల్సి ఉంది. దీంతో ఆయన శాసన సభకు పోటీ చేస్తారా లేదా శాసన మండలికా అనేది కార్యకర్తలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శాసన సభ సభ్యత్వం పొందాలంటే ఆయన కోసం ఎవరో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిరానుంది. కానీ, శాసన మండలి అయితే నూతన సంవత్సరంలో పలువురి సభ్యుల పదవీ కాలం ముగియనుంది. మహావికాస్ ఆఘాడి సభ్యులు మళ్లీ సునాయాసంగా విజయం సాదించేందుకు అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పదవి కాలం ముగియనున్న శాసన మండలి సభ్యుల వివరాలు..
- ఎన్సీపీ: విద్యా చవాన్, సతీష్ చవాన్, హేమంత్ టకలే, ఆనంద్ ఠాకూర్; కిరణ్ పావస్కర్, ఖాజా బేగ్, జగన్నాథ్ శిందే, ప్రకాష్ గజబియేలున్నారు. రామరావ్ వడకుతే, రాహుల్ నార్వేకర్‌లు రాజీనామా చేశారు.
- కాంగ్రెస్: అనంత్ గాడ్‌గిల్, హుస్న్‌బాను ఖాలేఫస్త్ర, జనార్దన్ చందూర్కర్, ఆనందరావ్ పాటిల్, హరిభావు రాఠోడ్, రామహరి రూపనవార్‌లున్నారు. చంద్రకాంత్ రఘువంశి రాజీనామా చేశారు.
- బీజేపీ: అరుణ్ ఆడసూడ్, పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్, స్మీతా వాఘ్, అనీల్ సోలేలున్నారు. చంద్రకాంత్ పాటిల్ శాసన సభకు ఎన్నిక కావడంతో ఆయన పదవి ముగిసింది.
- శివసేన: నీలం గోరే.
- పీపల్స్ రిపబ్లికన్: జోగేంద్ర కవాడే.
- ఇండిపెండెంట్: శ్రీకాంత్ దేశ్‌పాండే, దత్తాత్రేయ సావంత్.
Comments
Please login to add a commentAdd a comment