
సాక్షి, హైదరాబాద్: టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ సేన ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అరెస్టు అయిన సంగారెడ్డి వాసి రాంనగేశ్‌కు బెయిల్ లభించింది. ముంబైలోని మేజిస్ట్రేట్ న్యాయస్థానం షరతులతో శనివారం అతనికి బెయిల్ మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ ప్రాంతానికి చెందిన రాంనగేశ్ తండ్రి శ్రీనివాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. రాంనగేశ్ కందిలో ఉన్న హైదరాబాద్ ఐఐటీ నుంచి ఉన్నత విద్యనభ్యసించాడు.
బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేశ్... ఎంఎస్ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ట్విట్టర్ ద్వారా అతను గతనెలలో ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ నెల 9న ముంబై పశ్చిమ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు రాంనగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రాంనగేశ్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు రూ.50 వేలకు పర్సనల్ బాండ్, అంతే మొత్తానికి సెక్యూరిటీ బాండ్ సమర్పించాలని ఆదేశించింది. నెల రోజుల వరకు ప్రతి సోమ, గురువారాల్లో ముంబై వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో హాజరుకావాలని షరతులు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment