‘ఆ జీవో ఇచ్చింది చంద్రబాబే’ | Malladi Vishnu Slams Chandrababu Over Tirumala Bus Ticket Issue | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మల్లాది విష్ణు

Published Fri, Aug 23 2019 4:08 PM | Last Updated on Fri, Aug 23 2019 9:01 PM

Malladi Vishnu Slams Chandrababu Over Tirumala Bus Ticket Issue - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి పనులతో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బస్సు టిక్కెట్ల మీద ప్రచారం కోసం జీవో ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ బస్‌ టిక్కెట్ల మీద ఇమామ్‌లు, హజ్‌యాత్ర, జెరూసలేం గురించి ప్రచారం చేయించారని.. ఇప్పటికీ అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విషయంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తమకు అన్ని మతాలు, ప్రాంతాలు, వర్గాలు సమానమని పేర్కొన్నారు. బస్సు టిక్కెట్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటికే విచారణకు ఆదేశించారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై  చర్యలు తప్పవని హెచ్చరించారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ ట్రాప్‌లో పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణు విమర్శించారు. ఆవుల మరణానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ మంత్రి ఉండగా చాలా ఆవులు చనిపోయాయి.. దానికి బీజేపీ బాధ్యత వహిస్తుందా అని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా, మాణిక్యాల రావు మంత్రిగా ఉండగా విజయవాడలో 50 హిందూ దేవాలయాలను కూలదోశారని ఆరోపించారు. పుష్కర మరణాలు ఎవరి కాలంలో జరిగాయో అందరికి తెలుసునని..సదావర్తి దేవుడు భూములను కాజేసిన చరిత్ర టీడీపీ నేతలదని విమర్శించారు. రాష్ట్రంలో మనుగడ కష్టమని తెలిసి... రాజకీయంగా లబ్ది పొందేందుకే బీజేపీ, టీడీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement