
మల్లు భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)
సాక్షి, అయ్యవారిగూడెం(మధిర): పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి.. ఆత్మ గౌరవంతో జీవిస్తామన్న పాపానికి రైతుల చేతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే
చెందుతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మధిర నియోజకవర్గంలో ఆత్మగౌరవ రెండో రోజు సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆత్మ గౌరవం ప్రశ్నించబడే స్థితికి చేరుకుందని.. అందుకే ఆత్మ గౌరవ యాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు. ఏ ఆత్మ గౌరవం కోసం.. పోరాటాలు చేసి, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మ గౌరవం ప్రశ్నార్థకంగా మారిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఉద్యోగాలు అడిగిన పాపానికి ఉస్మానియాను ఓపెన్ జైల్ చేసి బంధించారని ధ్వజమెత్తారు. ప్రతి కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హౌసింగ్ శాఖనే ఎత్తివేసి ఎవరికీ ఇళ్లు రాకుండా చేసిందని మండిపడ్డారు. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి కాంగ్రెస్ నేతృత్వంలోని పీపుల్స్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment