self esteem
-
ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్
సాక్షి, నల్లగొండ/ భువనగిరి: ప్రేమ విఫలమైందని.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆరోగ్య సమస్యలు కుదుటపడడం లేదని.. సంతాన భాగ్యం కలగలేదని.. ఉద్యోగం రావడం లేదనే ఆత్మన్యూనతా భావంతో ఎందరో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. కారణాలు ఏమైతేనేం క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను చేజేతులా బలితీసుకుంటున్నారు. అందుకు రైల్వేట్రాక్‌లు కేరాఫ్‌లుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైళ్ల కిందపడి 166మంది అఘాయిత్యాలకు ఒడిగట్టారని రైల్వేపోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు క్షణికావేశంలో రైలు పట్టాలను కేరాఫ్‌గా మార్చుకుని అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా యువకులే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. క్షణికావేశంలో వెంటనే తీసుకుని సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతినెలా 6 నుంచి 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రైల్వేపోలీస్ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. మృతుల్లో అధికమంది 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎదిగివచ్చిన పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. అధికంగా ఎక్కడెక్కడంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్ల పరిధిలో అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైల్వే లైన్ పగిడిపల్లి నుంచి విష్ణుపురం వరకు 134.5 కిలోమీటర్లు, బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆలేరు వరకు 45 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నల్లగొండకు అప్ అండ్ డౌన్ 32రైళ్లు, భువనగిరి–ఆలేరు మధ్య 37 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన వ్యక్తితో భారతికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనారోగ్య కారణాలతో ఆ కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారం భారతిపై పడింది. తాను నార్కట్‌పల్లిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తూ బతుకుబండిని లాగిస్తోంది. అయితే డిగ్రీ చదువుతున్న భారతి కుమారుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి తిరస్కరించడంతో గత ఏడాది అక్టోబర్‌లో సీతారాంపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మన్యూనతతో.. అధికంగా నల్లగొండ–రాయినిగూడెం, మిర్యాలగూడ–కొండ్రపోలు , బీబీనగర్–వంగపల్లి మధ్య, బీబీనగర్ పగిడిపల్లి మధ్య ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీస్ రికార్డుల పరిశీలనలో తేలింది. క్షణికావేశం, ప్రేమవిఫలం, ఉద్యోగాలులేవని అనేక రకాలుగా కలత చెందిన యువత ఆత్మన్యూనతా భావానికి లోనై ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తూ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారని రైల్వేపోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య పిట్టల నర్సింహ మృతదేహం భువనగిరి అర్బన్: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తారకరామానగర్‌కు చెందిన పిట్టల నర్సింహ(41) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. భువనగిరి–పగిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కిలోమీటర్ నంబర్ 245/11–13 వద్ద సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ టి.అచ్చుతం తెలిపారు. దంపతుల బలవన్మరణం ఆర్థిక ఇబ్బందులా..? సంతానం లేకనా..? నల్లగొండ క్రైం: పట్టణంలోని పాతబస్తీలోని మాల్బౌలికి చెందిన ఆటో డ్రైవర్ మురారిశెట్టి నగేశ్(36), భార్య చరిత(21) సోమవారం రాత్రి 9గంటలకు విజయవాడ నుంచి సికిం ద్రాబాద్ వైపు వెళ్తున్న అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా.. పిల్లలు లేరన్న కారణమా అన్నది తెలియరాలేదు. రైల్వే ఎస్సై అచ్యుత్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా జీవనంసాగిస్తున్న నగేశ్, భా ర్య చరితలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రైలుకు అడ్డంగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఎయిర్ పైప్‌కు అడ్డంగా మృతదేహాలు ఇరుక్కుపోవడంతో అర కిలోమీటర్ దూరం ఈ డ్చుకెళ్లింది. ఈ సంఘటనతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 8నిమిషాలు ఆగింది. ఎయిర్ పైప్‌కు అడ్డంగా ఉన్న మృతదేహం అవయవాలను తొలగించారు. ఆ తర్వాతనే రైలు సికింద్రాబాద్ వైపు నకు వెళ్లింది. లోకో పైలెట్ నల్లగొండ రైల్వేస్టేషన్ మేనేజర్ రవికుమార్‌కు సమాచా రం అందించారు. వెంటనే ఆయన పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో మృతదేహాల అవయవాలను మంగళవారం మార్చురీకి తరలిం చి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగేష్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతోపాటు సంతానం లేదని మదన పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం నగేశ్‌తో చరితకు వివాహమైంది. వీరి స్వగ్రామం హాలియా మండలం యాచారం. అక్కడినుంచి వచ్చి నల్లగొండలో స్థిరపడ్డాడు. క్షణికావేశంలోనే.. క్షణికావేశంలోనే యువకులు ఆత్మహత్యే శరణ్యంగా భావించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వస్తున్నారు. రైలు తాకిడికి వారి శరీరం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోతుండడంతో వాటిని తొలగించేందుకు మనస్సు గగుర్పొడుస్తుంది. అన్నం కూడా తినలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. – రైల్వే ఎస్సై, అచ్యుత్‌రామ్ -
‘రైతుల చేతులకు సంకెళ్లు వేసిన ఘనత టీఆర్ఎస్దే’
సాక్షి, అయ్యవారిగూడెం(మధిర): పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి.. ఆత్మ గౌరవంతో జీవిస్తామన్న పాపానికి రైతుల చేతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మధిర నియోజకవర్గంలో ఆత్మగౌరవ రెండో రోజు సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆత్మ గౌరవం ప్రశ్నించబడే స్థితికి చేరుకుందని.. అందుకే ఆత్మ గౌరవ యాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు. ఏ ఆత్మ గౌరవం కోసం.. పోరాటాలు చేసి, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మ గౌరవం ప్రశ్నార్థకంగా మారిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఉద్యోగాలు అడిగిన పాపానికి ఉస్మానియాను ఓపెన్ జైల్ చేసి బంధించారని ధ్వజమెత్తారు. ప్రతి కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ శాఖనే ఎత్తివేసి ఎవరికీ ఇళ్లు రాకుండా చేసిందని మండిపడ్డారు. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి కాంగ్రెస్ నేతృత్వంలోని పీపుల్స్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
వయసు తగ్గుతుందేమో కానీ..
న్యూయార్క్: ఫేస్‌లిఫ్ట్ ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పోందుతున్న కాస్మొటిక్ సర్జరీ. వయసు మీద పడుతున్నవారు యవ్వనంగా కన్పించాలనే తాపత్రయంతో ఎక్కువగా ఈ సర్జరీ మీద ఆధారపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ సర్జరీని ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. ఫేస్‌లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాస్తవానికి ఉన్న వయసు కంటే 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తారని ప్రచారంలో ఉంది. ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వలన ముఖంలో వయసు తాలూకు చాయలు తగ్గుతాయేమో కానీ.. వారి ఆత్మవిశ్వాసం మాత్రం మెరుగుపడడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. న్యూయార్క్‌కు చెందిన 'ఆండ్రూ జుకానో ఫేసియల్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ' అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా ఫేస్ లిఫ్టింగ్ సర్జరీ చేయించుకున్న పలువురి అభిప్రాయాలను సేకరించగా, వారిలో ఈ చికిత్స తర్వాత ఆత్మవిశ్వాసంలో ఎలాంటి పురోగతి కన్పించలేదని తెలిపింది. అంతే కాకుండా సర్జరీతో ప్రస్తుత వయసుకు దాదాపు 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తున్నామని తెలిపిన వారు.. ఆ వయసులోని వారిలా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంలో మాత్రం వెనుకబడుతున్నామని తెలిపారు. -
వాళ్లు.. ఆటోవికులు కాదు!
ఆటోవాణ్ణి మనలో చాలామంది అపార్థం చేసుకుంటుంటాం. గిట్టనివాళ్లు కొందరు ‘ఆటోవికుడు’ అని కూడా నోరు చేసుకుంటుంటారు. ఆటోడ్రైవర్నూ, అతడి తాలూకు విపరీత ప్రవర్తననూ హైదరాబాదీల్లో దాదాపుగా అందరూ ఏదో ఒక బలహీన క్షణాల్లో తిట్టుకున్నవారే. అతడి మర్యాదామన్ననా లేనిదనాన్నీ చూసి అసహ్యించుకున్నవారే. కానీ... నాకెందుకో సదరు ఆటోడ్రైవర్ మన హైదరాబాదీయులందరికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతున్నాడేమో అని నా అనుమానం. అందుకే అతడంటే నాకెంతో అభిమానం. ఆటోడ్రైవర్లలో చాలామంది మీటర్ ప్రకారం రారు. పైగా మీటరు మీద ‘ఎగస్ట్రా’ అడుగుతారు. చాలామంది ఇందుకు అతణ్ణి తప్పుపడుతుం టారు. నిజానికి అందులో తప్పేముంది చెప్పండి. ఫరెగ్జాంపుల్... మీరో మంచి హోటల్‌కు వెళ్తారు. బిల్లు కట్టే టైమ్‌లో సర్వరు అడగకున్నా టిప్పు ఇస్తారు. పైగా మనం వెళ్లిన హోటల్ కాస్త పెద్దదైతే... ఇచ్చే టిప్పు ఏమైనా తక్కువేమోనని, సర్వరుగారు మనల్ని చిన్నచూపు చూస్తాడేమోనని ఒకింత ఆందోళనతో ఏడుపొకటి! దాంతో హోటల్ బయటికి వచ్చేంతవరకూ కాస్త ఆత్మన్యూనతతో బాధపడుతూ ఉంటాం. ‘ఫలానా సర్వర్గారు అడక్కున్నా డబ్బులిస్తున్నప్పుడు... ఫలానా డ్రైవర్‌గారు అడిగినా సొమ్ములివ్వకపోవడంలో సబబేమిటి?’ అన్నది చాలామంది ఆటోడ్రైవర్ల ప్రశ్న! న్యాయమేగా? పైగా ఆటోడ్రైవర్ డబ్బులడిగే తీరు చూశారా? మీటర్ ‘మీద’ ఎగ్స్ట్రా ఇవ్వమంటాడు. అంటే ఇది బల్ల కింది వ్యవహారం కాదురా బాబూ... ‘మీటర్ పే(హిందీ)’ పే చేస్తావు కాబట్టి బాజాప్తా అధికారికంగా నేను తీసుకునేదే అన్న ధ్వనిని గొంతులో పలికింపజేసి, నువ్వు ఇవ్వకతప్పదు సుమా అనే సందేశాన్నీ మనకు పంపుతాడు. దాన్ని అహంకారమని అపార్థం చేసుకుంటాం గానీ.. అతడి దృష్టిలో అది ఆత్మవిశ్వాసం. ఎవడి దృష్టి కోణం నుంచి చూస్తే వాడిదే కరెక్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా! ఇక మరో విషయం. మనం కోఠీ నుంచి మెహదీపట్నానికి వెళ్దామనుకుంటాం. కానీ మనం ఊరికి కొత్త అన్న విషయం గ్రహించాడనుకోండి. అతడు వెంటనే వయా ‘కూకట్పల్లి’నో లేదా వయా ‘ఫలక్‌నుమా’నో అయితేనే వస్తానని అంటాడు. ఇదేదో పరమ దుర్మార్గమైన వ్యవహారమని మనలాంటి అజ్ఞానులం అనుకుంటాంగానీ... ఇందులోనూ చాలా లోతైన మతలబు ఉంది. చాలామంది దీన్ని మోసం అనే మారుపేరుతో పిలుస్తారు గానీ... ఇది మోసం కాదు. నిజానికి ఒకరకంగా చూస్తే ఇదో ‘వ్యాక్సిన్’ చికిత్సలాంటి వ్యవహారం. ఇలా ఊరంతా తిప్పి చూపించాక... కొత్తవాడికీ హైదరాబాద్ మీదా... దాని వేర్వేరు లొకేషన్ల మీద ఒక ఐడియా ఏర్పడుతుంది. సదరు కొత్త ప్రయాణికుడు ఒకసారి ఇలా ‘వ్యాక్సిన్’ చికిత్స చేయించుకున్నాడు కాబట్టి మళ్లీ అలాగే మోసపోయే అవకాశం ఉండదన్నమాట. ఈ విధంగా చేసే వ్యాక్సిన్ చికిత్సకు మళ్లీ న్యాయంగా మీటరు ప్రకారమే డబ్బు తీసుకుంటాడు డాక్టరు లాంటి ఆ డ్రైవరు. అయినా మన పిచ్చిగానీ... మీరు జెయింట్‌వీల్ ఎక్కారనుకోండి. అబ్బా... మరికాసేపు తిప్పితే బాగుండేదే అనుకుంటారు. అంతేగానీ ఎప్పుడెప్పుడు దిగిపోదాం అంటారా? జెయింట్‌వీల్ అనగానేమి? రాక్షస చక్రం. మరి రాక్షసచక్రం ఎక్కినప్పుడే మరికాసేపు ఉందామనుకునేవారు... అతి చిన్నవైన త్రిచక్రాలమీద చిన్నచూపు ఎందుకు? ఇలాంటి చిన్నచూపు వల్లనే ఆటోవాలాల మనసు చివుక్కుమని గబుక్కుమని ఒక మాటంటారు. అదేదీ పట్టించుకోకూడదనే సంయమనం నేర్పుతుంది ఆటోవాలాలతో మన అనుభవం. అందుకే ఆటోవాలంటే మరెవరో కాదు.. వారు నిత్య చక్ర సంచార సాధకులు! పరులనే మాటల్ని దులుపుకుపోవాలనే విషయాన్ని ప్రాక్టికల్‌గా నేర్పే వ్యక్తిత్వ వికాస పాఠాల బోధకులు!! - యాసీన్