వాళ్లు.. ఆటోవికులు కాదు!
ఆటోవాణ్ణి మనలో చాలామంది అపార్థం చేసుకుంటుంటాం. గిట్టనివాళ్లు కొందరు ‘ఆటోవికుడు’ అని కూడా నోరు చేసుకుంటుంటారు. ఆటోడ్రైవర్‌నూ, అతడి తాలూకు విపరీత ప్రవర్తననూ హైదరాబాదీల్లో దాదాపుగా అందరూ ఏదో ఒక బలహీన క్షణాల్లో తిట్టుకున్నవారే. అతడి మర్యాదామన్ననా లేనిదనాన్నీ చూసి అసహ్యించుకున్నవారే. కానీ... నాకెందుకో సదరు ఆటోడ్రైవర్ మన హైదరాబాదీయులందరికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతున్నాడేమో అని నా అనుమానం. అందుకే అతడంటే నాకెంతో అభిమానం.
ఆటోడ్రైవర్లలో చాలామంది మీటర్ ప్రకారం రారు. పైగా మీటరు మీద ‘ఎగస్ట్రా’ అడుగుతారు. చాలామంది ఇందుకు అతణ్ణి తప్పుపడుతుం టారు. నిజానికి అందులో తప్పేముంది చెప్పండి. ఫరెగ్జాంపుల్... మీరో మంచి హోటల్‌కు వెళ్తారు. బిల్లు కట్టే టైమ్‌లో సర్వరు అడగకున్నా టిప్పు ఇస్తారు. పైగా మనం వెళ్లిన హోటల్ కాస్త పెద్దదైతే... ఇచ్చే టిప్పు ఏమైనా తక్కువేమోనని, సర్వరుగారు మనల్ని చిన్నచూపు చూస్తాడేమోనని ఒకింత ఆందోళనతో ఏడుపొకటి! దాంతో హోటల్ బయటికి వచ్చేంతవరకూ కాస్త ఆత్మన్యూనతతో బాధపడుతూ ఉంటాం.
‘ఫలానా సర్వర్‌గారు అడక్కున్నా డబ్బులిస్తున్నప్పుడు... ఫలానా డ్రైవర్‌గారు అడిగినా సొమ్ములివ్వకపోవడంలో సబబేమిటి?’ అన్నది చాలామంది ఆటోడ్రైవర్ల ప్రశ్న! న్యాయమేగా? పైగా ఆటోడ్రైవర్ డబ్బులడిగే తీరు చూశారా? మీటర్ ‘మీద’ ఎగ్‌స్ట్రా ఇవ్వమంటాడు. అంటే ఇది బల్ల కింది వ్యవహారం కాదురా బాబూ... ‘మీటర్ పే(హిందీ)’ పే చేస్తావు కాబట్టి బాజాప్తా అధికారికంగా నేను తీసుకునేదే అన్న ధ్వనిని గొంతులో పలికింపజేసి, నువ్వు ఇవ్వకతప్పదు సుమా అనే సందేశాన్నీ మనకు పంపుతాడు. దాన్ని అహంకారమని అపార్థం చేసుకుంటాం గానీ.. అతడి దృష్టిలో అది ఆత్మవిశ్వాసం. ఎవడి దృష్టి కోణం నుంచి చూస్తే వాడిదే కరెక్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా! ఇక మరో విషయం. మనం కోఠీ నుంచి మెహదీపట్నానికి వెళ్దామనుకుంటాం.
కానీ మనం ఊరికి కొత్త అన్న విషయం గ్రహించాడనుకోండి. అతడు వెంటనే వయా ‘కూకట్‌పల్లి’నో లేదా వయా ‘ఫలక్‌నుమా’నో అయితేనే వస్తానని అంటాడు. ఇదేదో పరమ దుర్మార్గమైన వ్యవహారమని మనలాంటి అజ్ఞానులం అనుకుంటాంగానీ... ఇందులోనూ చాలా లోతైన మతలబు ఉంది. చాలామంది దీన్ని మోసం అనే మారుపేరుతో పిలుస్తారు గానీ... ఇది మోసం కాదు. నిజానికి ఒకరకంగా చూస్తే ఇదో ‘వ్యాక్సిన్’ చికిత్సలాంటి వ్యవహారం. ఇలా ఊరంతా తిప్పి చూపించాక... కొత్తవాడికీ హైదరాబాద్ మీదా... దాని వేర్వేరు లొకేషన్ల మీద ఒక ఐడియా ఏర్పడుతుంది. సదరు కొత్త ప్రయాణికుడు ఒకసారి ఇలా ‘వ్యాక్సిన్’ చికిత్స చేయించుకున్నాడు కాబట్టి మళ్లీ అలాగే మోసపోయే అవకాశం ఉండదన్నమాట. ఈ విధంగా చేసే వ్యాక్సిన్ చికిత్సకు మళ్లీ న్యాయంగా మీటరు ప్రకారమే డబ్బు తీసుకుంటాడు డాక్టరు లాంటి ఆ డ్రైవరు.
అయినా మన పిచ్చిగానీ... మీరు జెయింట్‌వీల్ ఎక్కారనుకోండి. అబ్బా... మరికాసేపు తిప్పితే బాగుండేదే అనుకుంటారు. అంతేగానీ ఎప్పుడెప్పుడు దిగిపోదాం అంటారా? జెయింట్‌వీల్ అనగానేమి? రాక్షస చక్రం. మరి రాక్షసచక్రం ఎక్కినప్పుడే మరికాసేపు ఉందామనుకునేవారు... అతి చిన్నవైన త్రిచక్రాలమీద చిన్నచూపు ఎందుకు? ఇలాంటి చిన్నచూపు వల్లనే ఆటోవాలాల మనసు చివుక్కుమని గబుక్కుమని ఒక మాటంటారు. అదేదీ పట్టించుకోకూడదనే సంయమనం నేర్పుతుంది ఆటోవాలాలతో మన అనుభవం. అందుకే ఆటోవాలంటే మరెవరో కాదు.. వారు నిత్య చక్ర సంచార సాధకులు! పరులనే మాటల్ని దులుపుకుపోవాలనే విషయాన్ని ప్రాక్టికల్‌గా నేర్పే వ్యక్తిత్వ వికాస పాఠాల బోధకులు!!
- యాసీన్