మమతా బెనర్జీ - అమిత్ షా(ఫైల్ ఫోటో)
కోల్‌కతా : ‘ఒక వేళ రేపు మహాత్మ గాంధీ కుటుంబం తమ బర్త్ సర్టిఫికేట్‌ను చూపించలేకపోతే అప్పుడు జాతీపిత మహాత్మ గాంధీని కూడా మనదేశానికి చెందిన వ్యక్తి కాదంటారేమో’ అంటూ మండిపడ్డారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ నివేదిక అంతా ఓ బూటకమంటూ కొట్టిపారేశారు. బెంగాలీ మాట్లాడే ప్రజలను అస్సాం ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురిచేస్తూ, వారందరిని భారతీయులు కాదంటోందని విమర్శించారు.
ఈ సందర్భంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశిస్తూ ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల జన్మ ధ్రువీకరణ పత్రాన్ని చూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఒక వేళ మహాత్మ గాంధీ కుటుంబ సభ్యులు కూడా బర్త్ సర్టిఫికెట్‌ను చూపించలేకపోతే అప్పుడు గాంధీజీని కూడా ఈ దేశం వాడు కాదంటారా అని ప్రశ్నించారు. కొద్ది రోజులైతే పశువులకు కూడా బర్త్ సర్టిఫికెట్లు ఉండాలంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఎన్‌ఆర్‌సీ నివేదిక అస్సాంలోని దాదాపు 40 లక్షల మందిని అక్రమ వలసదారులంటుంది. వారిలో దాదాపు 38 లక్షల మంది బంగ్లా మాట్లాడే హిందువులు, ముస్లింలు ఉన్నారన్నారు. ఓట్ల కోసమే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని ఆరోపించారు. బీజేపీవన్ని ఓటు బ్యాంకు రాజకీయాలంటూ విమర్శించారు.
అంతేకాక జమిలీ ఎన్నికలపై స్పందిస్తూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంత సులభం కాదు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే సరిపోతుందన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే అప్పుడు పరిస్థితి ఎంటి అని ప్రశ్నించారు. అంటే కేంద్రం, రాష్ట్రాలు మళ్లీ ఎన్నికలకు వెళ్తాయా అంటూ ప్రశ్నించారు. అందుకే తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment