కోల్‌కతా : ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమబెంగాల్ పర్యటనకు సిద్ధమైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ర్యాలీకి బెంగాల్ ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. దాంతో బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే 19న ఎన్నికలు జరిగే జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేగాక.. షా చాపర్ ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతిని కూడా వెనక్కితీసుకుంది.
కాగా, దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘తృణమూల్ కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ మౌనంగా ఉండటం దురదృష్టకరం. దీనిపై మేం ఆందోళన చేపడతాం’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ అనిల్ బాలుని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం నుంచి అమిత్ షాకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో దిగేందుకు ఆయన హెలికాప్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతల చాపర్ల ల్యాండింగ్‌కు కూడా దీదీ సర్కార్ అనుమతించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment