చెన్నైలోని స్టాలిన్ ఇంటి ముందు నిరసన ముగ్గు
న్యూఢిల్లీ/చెన్నై/పురులియా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు తెలుపుతున్న వారు జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కాషాయ పార్టీని ఏకాకిని చేసేందుకు కలిసి రావాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలకు ఆమె పిలుపునిచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా సోమవారం పురులియాలో చేపట్టిన 5 కిలోమీటర్ల నిరసన ర్యాలీలో మమత ప్రసంగించారు. సీఏఏతోపాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రాష్ట్రంలో అమలు కానివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కేంద్రాన్ని హెచ్చరించారు.
సీఏఏపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఓటరు జాబితాలో మీరంతా పేర్లు నమోదు చేయించుకోండి. ఆ తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా’అని మమత అభయమిచ్చారు. సీఏఏ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేసి, అరెస్టయిన వారికి సంఘీభావం తెలుపుతూ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇల్లు, దివంగత కరుణానిధి ఇంటి వద్ద సంప్రదాయ ముగ్గులు వేశారు. సీఏఏ వద్దంటూ శనివారం చెన్నైలోని బీసెంట్ నగర్‌లో ముగ్గులు వేసినందుకు గాను ఐదుగురు మహిళలు సహా 8 మందిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే నేతల నివాసాల వద్ద సోమవారం సీఏఏ వ్యతిరేక నినాదాలతో ముగ్గులు వేశారు.
బాధిత కుటుంబాలకు సాయపడండి
సీఏఏ వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం అస్సాం పర్యటన సందర్భంగా ఇద్దరు మృతుల కుటుంబాలను పరామర్శించినట్లు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment