కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పాలక మమతా సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మిడ్నపూర్ కిసాన్ ర్యాలీలో చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. నిప్పుతో చెలగాటం వద్దని మోదీకి హితవు పలికింది. ఈ ర్యాలీకి పొరుగు రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిషాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారని విమర్శించింది. కిసాన్ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో సిండికేట్ రాజకీయాలను నడిపిస్తూ అధికారంలో కొనసాగేందుకు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆరోపణలను తృణమూల్ దీటుగా తిప్పికొట్టింది.
మత ఛాందసవాదం, అవినీతి, హత్యారాజకీయాలతో బీజేపీ సిండికేట్‌గా మారిందని దుయ్యబట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రపంచంలో సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతోందని, అభివృద్ధి అజెండాలేని ప్రధాని మోదీ కేవలం రాజకీయాలతో పబ్బం గడుపుకునేందుకు వచ్చారని పేర్కొంది.
మోదీ ఎన్ని మాటలు చెప్పినా బెంగాల్‌లో బీజేపీకి ఫలితం సున్నా అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు మోదీ ర్యాలీలో టెంట్ కూలి 20 మందికి గాయాలైన ఘటన పట్ల తృణమూల్ విచారం వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు అన్నిరకాలుగా సాయం చేసేందుకు సిద్ధమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment