
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి మిలిటరీ దుస్తులు ధరించి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన మనోజ్ తీవారి జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్‌లో మండిపడ్డారు.
‘సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్‌ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారు‘ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇచ్చారు. ‘మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్‌లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్‌లో ఎదురుప్రశ్నించారు.