ఉమ్మడి జిల్లాలో రసవత్తర రాజకీయం  | Many Leaders Are Expecting For Two MLA Tickets | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో రసవత్తర రాజకీయం 

Published Mon, May 14 2018 1:23 PM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM

Many Leaders  Are Expecting For Two MLA Tickets - Sakshi

కడియం శ్రీహరి, కడియం కావ్య

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ లో కొత్త పోరు మొదలవుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలువురు అధికార పార్టీ ముఖ్యు లు.. తమ కుటుంబాల్లో తమతోపాటు మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు టికెట్‌కు సంబం ధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే ఒకే కుటుంబం నుంచి రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు పెరగడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండే సి చొప్పున టికెట్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలతో పలు నియోజకవర్గాల్లో రాజకీయాలు వేడెక్కాయి.

టికెట్లు ఆశిస్తున్న నేతలు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నాలుగు కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒక కుటుంబంలో ఒకటికి మించి రాజకీయ పదవులు ఆశిస్తున్న నేతలతో అధికార పార్టీ అధిష్టానానికి కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కడియం రాజకీయ ప్రస్థానమంతా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం కేంద్రంగానే జరిగింది.

2014 ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్‌ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాజకీయంగా బలం ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి తన కూతురు కడియం కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కడియం శ్రీహరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామంతో ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌లో మళ్లీ పోటీ రాజకీయాలు పెరిగాయి. వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. ఆమె భర్త కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. వీరి కూతురు కొండా సుస్మితాపటేల్‌ను తమతోపాటు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దింపేందుకు వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ మేరకు కొన్ని నెలలుగా భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. సుస్మితాపటేల్‌ భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారని కొండా సురేఖ ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. భూపాలపల్లిలో అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌.మధుసూదనాచారి ఉన్నారు. శాసనసభ స్పీకర్‌గా మధుసూదనాచారి టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి దగ్గరగానే ఉంటున్నారు.

వచ్చే ఎన్నిక ల్లోనూ తనకే అవకాశం వస్తుందని ధీమాతో ఉన్నారు. మరో వైపు టీడీపీలో కీలకనేతగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు కొన్ని నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై హామీతోనే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని గండ్ర సత్యనారాయణరావు చెబుతున్నారు. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్రకు ప్రత్యేకంగా బలం ఉంది.

ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇప్పటికే మధుసూదనాచారి, గండ్ర వర్గాలుగా విడిపోయి ఉన్నాయి. కొండా సురేఖ ప్రకటనతో తాజాగా భూపాలపల్లి టీఆర్‌ఎస్‌ మూడు వర్గాలుగా విడిపోయిందని పలువురు వాపోతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారించారు.

ప్రదీప్‌రావు 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున ఈ సెగ్మెంట్‌లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో వరంగల్‌ తూర్పు టికెట్‌ తనకే వస్తుందని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

2014 ఎన్నికల్లో ప్రస్తుత డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్, ఆయన కూతురు మాలోతు కవిత మానుకోట నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. అనంతరం వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే సిట్టింగులకు సీటు గ్యారంటీ అంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ఇచ్చిన హామీ ప్రకారం రెడ్యానాయక్‌కు డోర్నకల్‌ సీటుకు ఢోకా లేదని భావించవచ్చు. కాగా, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సొంత వర్గంతో ఆమె అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టికెట్‌ కోసం ఇద్దరు ప్రయత్నిస్తుండడంతో మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌లో ఇప్పుడిప్పుడే వర్గపోరు పెరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

కొండా సురేఖ, సుస్మితాపటేల్‌

2
2/3

ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

3
3/3

డీఎస్‌ రెడ్యానాయక్, మాలోతు కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement