చంద్రబాబును నమ్మితే నాశనమే | Meda Mallikarjuna Reddy Fires On Chandrababu and Met YS Jagan | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నమ్మితే నాశనమే

Published Wed, Jan 23 2019 3:12 AM | Last Updated on Wed, Jan 23 2019 4:34 AM

Meda Mallikarjuna Reddy Fires On Chandrababu and Met YS Jagan - Sakshi

మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్చం ఇస్తున్న మేడా మల్లికార్జునరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ /అమరావతి: చంద్రబాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుందని వైఎస్సార్‌ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జునరెడ్డి చెప్పారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబును ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మేడా మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అన్ని పదవులకు రాజీనామా చేయాల్సిందిగా జగన్‌ సూచించినట్టు తెలిపారు. ఈ మేరకు విప్, ఎమ్మెల్యే పదవులకు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను బుధవారం టీడీపీ అధిష్టానానికి పంపుతానన్నారు. చంద్రబాబు గంజాయి వనం నుంచి జగన్‌ తులసి వనంలోకి వచ్చినట్లుగా ఉందని మేడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి. చిత్రంలో విజయసాయిరెడ్డి, రఘునాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి  

ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని విమర్శించారు. టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించానన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటని, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని అన్నారు. ఆయన్ను ఇప్పుడెవరూ నమ్మడం లేదన్నారు. ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు చరిత్ర సృష్టించాయని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుతం సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని మేడా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ రాజకీయ భిక్ష పెడితే ఆదినారాయణరెడ్డి గెలిచారని, తర్వాత వంచనకు పాల్పడి టీడీపీలో చేరి మంత్రి అయ్యారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. మేడాతో పాటు వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో మేడా రఘునాథరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి, మేడా రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పీసీ యోగీశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

మేడా కార్యాలయంలో కూన దౌర్జన్యం 
రాష్ట్ర శాసనసభ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా ఒక విప్‌ కార్యాలయంలోకి మరో విప్‌ ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ నేతృత్వంలో టీడీపీ శాసనసభా పక్ష కార్యాలయ సిబ్బంది మరో విప్‌ మేడా మల్లిఖార్జునరెడ్డి కార్యాలయంలోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అక్కడి సిబ్బంది వారిస్తున్నా వినకుండా కాగితాలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని చింపి పారేశారు. వారి ఆగడాన్ని ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని అడ్డుకున్నారు. తాను విప్‌ పదవికి రాజీనామా చేశానని, తనకు సంబంధించిన కాగితాలు, వస్తువులను భద్రపరచాల్సిందిగా మేడా మధ్యాహ్నం ఫోన్‌ చేసి చెప్పారని, ఈలోగానే కూన రవికుమార్‌తో సహా టీడీఎల్‌పీ సిబ్బంది వచ్చి విధ్వంసానికి దిగినట్లు సిబ్బంది చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement