meda mallikharjuna reddy
-
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
చంద్రబాబును నమ్మితే నాశనమే
సాక్షి, హైదరాబాద్ /అమరావతి: చంద్రబాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుందని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి చెప్పారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబును ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మేడా మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అన్ని పదవులకు రాజీనామా చేయాల్సిందిగా జగన్ సూచించినట్టు తెలిపారు. ఈ మేరకు విప్, ఎమ్మెల్యే పదవులకు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను బుధవారం టీడీపీ అధిష్టానానికి పంపుతానన్నారు. చంద్రబాబు గంజాయి వనం నుంచి జగన్ తులసి వనంలోకి వచ్చినట్లుగా ఉందని మేడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి. చిత్రంలో విజయసాయిరెడ్డి, రఘునాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని విమర్శించారు. టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించానన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటని, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని అన్నారు. ఆయన్ను ఇప్పుడెవరూ నమ్మడం లేదన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు చరిత్ర సృష్టించాయని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుతం సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని మేడా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ రాజకీయ భిక్ష పెడితే ఆదినారాయణరెడ్డి గెలిచారని, తర్వాత వంచనకు పాల్పడి టీడీపీలో చేరి మంత్రి అయ్యారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. మేడాతో పాటు వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మేడా రఘునాథరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి, మేడా రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడా కార్యాలయంలో కూన దౌర్జన్యం రాష్ట్ర శాసనసభ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా ఒక విప్ కార్యాలయంలోకి మరో విప్ ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ నేతృత్వంలో టీడీపీ శాసనసభా పక్ష కార్యాలయ సిబ్బంది మరో విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి కార్యాలయంలోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అక్కడి సిబ్బంది వారిస్తున్నా వినకుండా కాగితాలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని చింపి పారేశారు. వారి ఆగడాన్ని ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని అడ్డుకున్నారు. తాను విప్ పదవికి రాజీనామా చేశానని, తనకు సంబంధించిన కాగితాలు, వస్తువులను భద్రపరచాల్సిందిగా మేడా మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పారని, ఈలోగానే కూన రవికుమార్‌తో సహా టీడీఎల్పీ సిబ్బంది వచ్చి విధ్వంసానికి దిగినట్లు సిబ్బంది చెప్పారు. -
ప్రజల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం
సిద్దవటం: జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే వచ్చిందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కడపాయపల్లె, లింగంపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి మంగళ వాండ్లపల్లె పాఠశాల వద్ద శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచులు ఆర్.లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పింఛన్ల పెంపు, డ్వాక్రా, రైతుల రుణమాఫీ, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2.50లక్షలు వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కడపాయపల్లెలో ఎమ్మెల్యే, ఆర్డీఓ ప్రభాకర్పిళ్లై చౌకదుకాణాన్ని ప్రారంభించారు. అలాగే ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మల, సూపర్వైజర్లు నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గర్భవతులకు పసుపు, కుంకుమ, జాకెట్, పూలు, పండ్లుతో పాటు అంగన్వాడీల ద్వారా ఇచ్చే బియ్యం, కందిపప్పు, గుడ్లు, ఆయిల్ వంటి వస్తువులు వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మండల పర్యవేక్షణాధికారి సుబ్బారావు, ఎంపీడీఓ పద్మావతి, ప్రత్యేక డిప్యూటీ తహశీల్దార్ శ్రీధర్‌రావు, ఎంపీపీ నరసింహరెడ్డి, టక్కోలి ఎంపీటీసీ నాగమునిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు జగదీష్ కుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు సంజీవరెడ్డి, దశరథ రామనాయుడు, గోపాల్, జవహర్ బాషా, ఓబులయ్య, రాజేశ్వర్‌రెడ్డి, పాలకొండయ్య, అధికారులు పాల్గొన్నారు.