సొంతూరును పట్టించుకోని ‘చిరు’ బ్రదర్స్‌ | Mega Family Did Nothing For Mogaltur | Sakshi
Sakshi News home page

మెగా ఫ్యామిలీ..ఊరుకు చేసింది శూన్యం..

Published Thu, Mar 28 2019 9:43 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

Mega Family Did Nothing For Mogaltur - Sakshi

సాక్షి, నరసాపురం : ‘పేరుకే పెద్ద మనుషులు కాని వారివి చాలా చిన్న మనసులు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు ఏదో చేయాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది కాని ఈ మెగా ఫ్యామిలీ మాత్రం సొంతూరును పట్టించుకోలేదు. మీ గుర్తుగా ఊరిలో గ్రంథాలయం కాని, ప్రభుత్వ ఆసుపత్రి కాని నిర్మించుకునేందుకు  సొంతింటిని ఇవ్వాలని గ్రామస్తులు కోరినా పెడచెవిన పెట్టి డబ్బు కోసం ఇంటిని అమ్ముకున్న చరిత్ర వీరి సొంతం..’

మెగా ఫ్యామిలీ మొత్తానికి నరసాపురంతో పాటుగా జిల్లా మొత్తం అనుబంధం ఉంది. కానీ జిల్లాపై వారు ప్రేమ చూపిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. దేశంలో ఎంతో మంది ప్రముఖులు తమతమ జీవితాల్లో ఉన్నత శిఖరాలు చేరిన తరువాత జన్మభూమిపై మమకారాన్ని చూపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కనీసంగా పట్టించుకోకపోవడం గమనార్హం. చిరంజీవి తండ్రి వెంకట్రావుది పెనుగొండ. కానీ అత్తగారి ఊరు మొగల్తూరులో స్థిరపడ్డారు. మొగల్తూరులో ఉండగా చిరంజీవి నరసాపురం మిషన్‌ ఆసుపత్రిలో జన్మించారు. నాగేంద్రబాబు కూడా ఇక్కడే పుట్టారు. చిరంజీవి తండ్రి ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేయడంతో అనేక ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు.

దీంతో ముగ్గురు బ్రదర్స్‌ మొగల్తూరులో అమ్మమ్మగారి ఇంటి వద్దే ఉండేవారు. చిరంజీవి, నాగేంద్రబాబులకు అయితే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ మొగల్తూరు హైస్కూల్‌లోనే చదవుకున్నారు. చిరంజీవి డిగ్రీ నరసాపురం వైఎన్‌ కళాశాలలో పూర్తి చేశారు. తన మొట్టమొదటి నాటకాన్ని వైఎన్‌ కళాశాలలోని అరబిందో ఆడిటోరియంలో చిరంజీవి ప్రదర్శించారు. కేవలం పుట్టిన ఊరుగానే కాదు మెగా బ్రదర్స్‌ ఎదుగుదలకు పునాదిపడ్డ ప్రాంతం నరసాపురం. కానీ వారి గుర్తుగా ఇక్కడ ఏమీ ఉండదు. వారు చిత్ర పరిశ్రమలో ఎదిగిన తరువాత ఈ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. తీరప్రాంతం కావడం తరచూ అనేక ప్రకృతి విపత్తులు ఈ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. అలాంటి సమాయాల్లో కూడా ఈ ప్రాంతం వారికి గుర్తుకే రాలేదు. మళ్లీ చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తరువాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు. పురిటిగడ్డకు ఏమీ చేయలేదనే విమర్శలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. 

చిరంజీవి సాయం నిరాకరించిన మొగల్తూరులోని కళాశాల  

ఇక్కడ కనిపిస్తున్న కళాశాల మొగల్తూరులోనిది. మొగల్తూరు అంటే మెగాస్టార్‌ చిరంజీవి పుట్టి పెరిగిన గ్రామం. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేంద్రబాబు బాల్యం మొత్తం గడిచింది ఈ గ్రామంలోనే. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా చిన్ననాడు తిరుగాడిన నేల ఇది. సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ మెగా బ్రదర్స్‌కు.. 1988లో స్థాపించిన ఈ కళాశాలకు ఎంతో సంబంధం ఉంది. మూరుమూల తీరప్రాంతం కావడంతో ఇక్కడ కళాశాల స్థాపించాలని నిర్ణయించిన గ్రామ పెద్దలకు ఆర్థికంగా చిక్కులు వచ్చాయి. ఇక్కడ పుట్టి పెరిగి సినీ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి వారికి గుర్తుకు వచ్చారు. కళాశాల స్థాపనకు సహకరించాలని గ్రామపెద్ద అందే భుజంగరావు తదితరులు అనేకమార్లు చిరంజీవిని కలిశారు. నాగేంద్రబాబుకు కూడా విషయం చెప్పి, అన్నను ఒప్పించాలని కోరారు. కానీ కనీసంగా కూడా వారి నుంచి సహకారం రాలేదన్నది  అందే భుజంగరావు లాంటి పెద్దల ఆవేదన. దీంతో గ్రామంలోని అందేవారి కుటుంబమే అందే బాపన్న పేరుతో జూనియర్‌ కళాశాలను స్థాపించారు. తరువాత ఇందులోనే కోట్ల వెంకట రంగారావు డిగ్రీ కళాశాలను కూడా 1994లో ఏర్పాటు చేశారు. 

అభిమానులు చిరంజీవి పేరుతో గ్రంథాలయం కట్టారు
మొగల్తూరు గ్రామంలోకి ప్రవేశించగానే పైన చిరంజీవి బొమ్మతో ఉన్న గ్రంథాలయం కనిపిస్తుంది. అయితే ఈ భవనంలో కూడా చిరు ఫ్యామిలీ సాయం రూపాయి కూడా లేదు. చిరంజీవి అభిమానులు చందాలు వసూలు చేసి ప్రభుత్వ గ్రంథాలయానికి భవనం కట్టించారు. చిరంజీవి బొమ్మ పెట్టుకున్నారు. సొంతూరులో గ్రంథాలయం తమ పేరుపై కడుతున్నారని తెలిస్తే, ఓ మాదిరి వ్యక్తి సైతం తనకు తోచిన సహాయం చేస్తారు. కానీ ఈ విషయంలోనూ తమ దారి అదికాదని నిరూపించారు మెగా బ్రదర్స్‌. వైఎన్‌ కళాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిగ్రీ మూడేళ్లు చిరంజీవి ఇక్కడ చదివారు. నాగేంద్రబాబు సైతం ఇంటర్‌ ఇక్కడే చదివారు. కానీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి సాయం చేసి ఎరుగరు. ఈ కళాశాలలో చదువుకున్న సినీ నటుడు కృష్ణంరాజు, దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వారు తమతమ పేర్లపై ఒక్కో భవనాన్ని కట్టించి ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా చిరు బ్రదర్స్‌ కళాశాల అభివృద్ధికి సాయం చేసిన పాపాన పోలేదు.

అలాగే ఊరిలో స్నేహితులకు తోడ్పాటు ఇచ్చే విషయంలో కూడా శ్రద్ధ చూపలేదు. సొంత ఊరికి పైసా పెట్టలేదని విమర్శలు రావడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడైన తరువాత ఎంపీ ల్యాండ్స్‌ రూ. 5 కోట్లు విడుదల చేయించి మొగల్తూరు మండలం పేరుపాలెంలో రోడ్లు, డ్రెయిన్స్‌ కట్టించి చేతులు దులుపుకున్నారు. అదే ఎంపీ ల్యాండ్స్‌ నుంచి వైఎన్‌ కళాశాలకు రూ. 15 లక్షలు ఇప్పించి విమర్శలను కడిగేసే చిరు ప్రయత్నం చేశారు గానీ జేబులో సొంత రూపాయి మాత్రం తీయనేలేదు. 


ఇక్కడ కనిపిస్తున్న పెంకుటింటికి మరో చరిత్ర ఉంది. సినీ ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, దానితో పాటే కోట్లు గడించిన మెగా ఫ్యామిలీకి చెందిన ఇల్లు ఇది. సాక్షాత్తు చిరంజీవి అమమ్మగారి ఇల్లు. ఈ ఇంట్లో ఉండే చిరంజీవి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివారు. ఈ ఇంటిలోనే అద్దం ముందు నిల్చుని డాన్స్‌లు ప్రాక్టీస్‌ చేశారు. ఈ ఇంటిలో నుంచే సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తరువాత మెగాస్టార్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నారు. చిరంజీవి మేనమామకు చెందిన ఇల్లయినా కూడా, ఈ ఇల్లు చిరంజీవి అధీనంలోనే ఉండేది. అయితే చిరంజీవి జ్ఞాపకంగా ఈ ఇంటిని గ్రామంలో ఓ మోడల్‌గా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, అభిమానులు కలలు కన్నారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వాలని చిరు అండ్‌ బ్రదర్స్‌ను అడిగారు. ఈ ఇంటిలో గ్రంథాలయం గానీ, ప్రభుత్వ ఆసుపత్రిగానీ ఏర్పాటు చేస్తామని మీ జ్ఞాపకంగా ఉంటుందని అడిగించారు. కానీ 1999లో కేవలం 1.25 లక్షల రూపాయలకు ఇంటిని వేరే వారికి అమ్మేసుకుని, పురిటి గడ్డలో చిన్నపాటి జ్ఞాపకాన్ని కూడా మిగల్చకుండా కక్కుర్తి చూపింది ఈ మెగా ఫ్యామిలీ. మేనమామ ఇల్లయినా కూడా ఆ సొమ్మేదో చిరు ఫ్యామిలీ చెల్లించి, ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వడానికి ఈ మెగా బ్రదర్స్‌కు రూ 1.25 లక్షలు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సొంతూరిపై కూడా పిసరంతైనా మమకారం లేదని నిరూపిస్తోంది ఈ ఘటన.


సాయంచేసే మనసు లేదు


చిరంజీవికి గాని, వారి సోదరులకు గానీ ఇతరులకు సాయం చేసే మనసు లేదు. నేను దగ్గరి నుంచి గమనించారు. మొగల్తూరులో కళాశాల పెట్టాలని అనుకున్నప్పుడు అనేకసార్లు చిరంజీవిని కలిశాము. అతనితో ఊళ్లో చదువుకున్న వాళ్లని కూడా తీసుకెళ్లేవాడిని. ఒకసారి కృష్ణంరాజుతో కూడా చెప్పించాము. చిన్నవాడు నాగేంద్రబాబుకు కూడా విషయం తెలుసు. సినిమాల్లో అంత ఎత్తుకు ఎదిగారు, ఎవ్వరికీ పైసా సాయం చేయలేదు. సొంత ఊరు, సొంత మనుషులకే ఏమీ చేయని వారు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవ చేస్తారంటే ఎలా నమ్మాలి.
   – అందే భుజంగరావు, పేరుపాలెం, మొగల్తూరు మండలం


ఊరిపై వారికి పెద్దగా ప్రేమ ఉండదు


చిరంజీవి, నేను ఒకే స్కూల్‌లో చదువుకున్నాము. నేను ఒక సంవత్సరం సీనియర్‌ని. చిరంజీవి కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ఈ ఊరిని అసలు పట్టించుకోలేదు. పెద్ద స్టార్‌ అయ్యాడు గానీ, ఈ ఊరిని అభివృద్ధి చేద్దాము, ఇక్కడి వారిని డెవలప్‌ చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఊరిలో సొంత ఇంటిని కూడా అమ్మేసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ పెద్దగా తెలియదు కానీ, నాగేంద్రబాబు కూడా ఇక్కడే తిరిగేవారు.
– పువ్వాడ శేషగిరి, మొగల్తూరు


మనం గొప్పలు చెప్పుకోవడమే


చిరంజీవి నా వద్దే చదువుకున్నాడు. 9, 10 తరగతులప్పుడు నావద్దే చదువుకున్నాడు. వాళ్ల నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్స్‌ రావడంతో వేరే చోటుకు వెళ్లారు. కానీ అమ్మమ్మ ఊరు కావడంతో సెలవులకు ఇక్కడ (మొగల్తూరు)కే వచ్చే వారు. నాగేంద్రబాబు కూడా ట్యూషన్‌కు వచ్చేవాడు. పెద్ద వాళ్లు అయ్యారు. చిరంజీవిది మొగల్తూరు అని మనం గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే వారు సొంతూరుకు చేసింది ఏమీలేదు. 
– పులగండం వెంకటేశ్వరరావు, చిరంజీవికి చదువు చెప్పిన టీచర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement