Mogalthur
-
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం
-
12 కేజీల పండుగప్ప చేప.. అయినా ఏం లాభమప్ప!
సాక్షి, పశ్చిమగోదావరి: మొగల్తూరులో ఓ రైతు సాగు చేస్తున్న చేపల చెరువులో 12 కేజీల పండుగప్ప చేప దొరికింది. సాధారణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. అయితే ఈ చేప 12 కేజీల బరువు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మొన్నటివరకూ కేజీ రూ.600 ధర పలికిన పండుగప్ప ధర ప్రస్తుతం రూ.300కు పడిపోయింది. దీంతో 12 కేజీల చేప దొరికినా.. ఆ రైతు మాత్రం నిట్టూర్పు విడిచాడు. –మొగల్తూరు(నర్సాపురం) -
సొంతూరును పట్టించుకోని ‘చిరు’ బ్రదర్స్
సాక్షి, నరసాపురం : ‘పేరుకే పెద్ద మనుషులు కాని వారివి చాలా చిన్న మనసులు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు ఏదో చేయాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది కాని ఈ మెగా ఫ్యామిలీ మాత్రం సొంతూరును పట్టించుకోలేదు. మీ గుర్తుగా ఊరిలో గ్రంథాలయం కాని, ప్రభుత్వ ఆసుపత్రి కాని నిర్మించుకునేందుకు సొంతింటిని ఇవ్వాలని గ్రామస్తులు కోరినా పెడచెవిన పెట్టి డబ్బు కోసం ఇంటిని అమ్ముకున్న చరిత్ర వీరి సొంతం..’ మెగా ఫ్యామిలీ మొత్తానికి నరసాపురంతో పాటుగా జిల్లా మొత్తం అనుబంధం ఉంది. కానీ జిల్లాపై వారు ప్రేమ చూపిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. దేశంలో ఎంతో మంది ప్రముఖులు తమతమ జీవితాల్లో ఉన్నత శిఖరాలు చేరిన తరువాత జన్మభూమిపై మమకారాన్ని చూపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కనీసంగా పట్టించుకోకపోవడం గమనార్హం. చిరంజీవి తండ్రి వెంకట్రావుది పెనుగొండ. కానీ అత్తగారి ఊరు మొగల్తూరులో స్థిరపడ్డారు. మొగల్తూరులో ఉండగా చిరంజీవి నరసాపురం మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. నాగేంద్రబాబు కూడా ఇక్కడే పుట్టారు. చిరంజీవి తండ్రి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేయడంతో అనేక ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో ముగ్గురు బ్రదర్స్ మొగల్తూరులో అమ్మమ్మగారి ఇంటి వద్దే ఉండేవారు. చిరంజీవి, నాగేంద్రబాబులకు అయితే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ మొగల్తూరు హైస్కూల్లోనే చదవుకున్నారు. చిరంజీవి డిగ్రీ నరసాపురం వైఎన్ కళాశాలలో పూర్తి చేశారు. తన మొట్టమొదటి నాటకాన్ని వైఎన్ కళాశాలలోని అరబిందో ఆడిటోరియంలో చిరంజీవి ప్రదర్శించారు. కేవలం పుట్టిన ఊరుగానే కాదు మెగా బ్రదర్స్ ఎదుగుదలకు పునాదిపడ్డ ప్రాంతం నరసాపురం. కానీ వారి గుర్తుగా ఇక్కడ ఏమీ ఉండదు. వారు చిత్ర పరిశ్రమలో ఎదిగిన తరువాత ఈ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. తీరప్రాంతం కావడం తరచూ అనేక ప్రకృతి విపత్తులు ఈ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. అలాంటి సమాయాల్లో కూడా ఈ ప్రాంతం వారికి గుర్తుకే రాలేదు. మళ్లీ చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తరువాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు. పురిటిగడ్డకు ఏమీ చేయలేదనే విమర్శలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. చిరంజీవి సాయం నిరాకరించిన మొగల్తూరులోని కళాశాల ఇక్కడ కనిపిస్తున్న కళాశాల మొగల్తూరులోనిది. మొగల్తూరు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టి పెరిగిన గ్రామం. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేంద్రబాబు బాల్యం మొత్తం గడిచింది ఈ గ్రామంలోనే. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చిన్ననాడు తిరుగాడిన నేల ఇది. సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ మెగా బ్రదర్స్‌కు.. 1988లో స్థాపించిన ఈ కళాశాలకు ఎంతో సంబంధం ఉంది. మూరుమూల తీరప్రాంతం కావడంతో ఇక్కడ కళాశాల స్థాపించాలని నిర్ణయించిన గ్రామ పెద్దలకు ఆర్థికంగా చిక్కులు వచ్చాయి. ఇక్కడ పుట్టి పెరిగి సినీ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి వారికి గుర్తుకు వచ్చారు. కళాశాల స్థాపనకు సహకరించాలని గ్రామపెద్ద అందే భుజంగరావు తదితరులు అనేకమార్లు చిరంజీవిని కలిశారు. నాగేంద్రబాబుకు కూడా విషయం చెప్పి, అన్నను ఒప్పించాలని కోరారు. కానీ కనీసంగా కూడా వారి నుంచి సహకారం రాలేదన్నది అందే భుజంగరావు లాంటి పెద్దల ఆవేదన. దీంతో గ్రామంలోని అందేవారి కుటుంబమే అందే బాపన్న పేరుతో జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత ఇందులోనే కోట్ల వెంకట రంగారావు డిగ్రీ కళాశాలను కూడా 1994లో ఏర్పాటు చేశారు. అభిమానులు చిరంజీవి పేరుతో గ్రంథాలయం కట్టారు మొగల్తూరు గ్రామంలోకి ప్రవేశించగానే పైన చిరంజీవి బొమ్మతో ఉన్న గ్రంథాలయం కనిపిస్తుంది. అయితే ఈ భవనంలో కూడా చిరు ఫ్యామిలీ సాయం రూపాయి కూడా లేదు. చిరంజీవి అభిమానులు చందాలు వసూలు చేసి ప్రభుత్వ గ్రంథాలయానికి భవనం కట్టించారు. చిరంజీవి బొమ్మ పెట్టుకున్నారు. సొంతూరులో గ్రంథాలయం తమ పేరుపై కడుతున్నారని తెలిస్తే, ఓ మాదిరి వ్యక్తి సైతం తనకు తోచిన సహాయం చేస్తారు. కానీ ఈ విషయంలోనూ తమ దారి అదికాదని నిరూపించారు మెగా బ్రదర్స్. వైఎన్ కళాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిగ్రీ మూడేళ్లు చిరంజీవి ఇక్కడ చదివారు. నాగేంద్రబాబు సైతం ఇంటర్ ఇక్కడే చదివారు. కానీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి సాయం చేసి ఎరుగరు. ఈ కళాశాలలో చదువుకున్న సినీ నటుడు కృష్ణంరాజు, దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వారు తమతమ పేర్లపై ఒక్కో భవనాన్ని కట్టించి ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా చిరు బ్రదర్స్ కళాశాల అభివృద్ధికి సాయం చేసిన పాపాన పోలేదు. అలాగే ఊరిలో స్నేహితులకు తోడ్పాటు ఇచ్చే విషయంలో కూడా శ్రద్ధ చూపలేదు. సొంత ఊరికి పైసా పెట్టలేదని విమర్శలు రావడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడైన తరువాత ఎంపీ ల్యాండ్స్ రూ. 5 కోట్లు విడుదల చేయించి మొగల్తూరు మండలం పేరుపాలెంలో రోడ్లు, డ్రెయిన్స్ కట్టించి చేతులు దులుపుకున్నారు. అదే ఎంపీ ల్యాండ్స్ నుంచి వైఎన్ కళాశాలకు రూ. 15 లక్షలు ఇప్పించి విమర్శలను కడిగేసే చిరు ప్రయత్నం చేశారు గానీ జేబులో సొంత రూపాయి మాత్రం తీయనేలేదు. ఇక్కడ కనిపిస్తున్న పెంకుటింటికి మరో చరిత్ర ఉంది. సినీ ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, దానితో పాటే కోట్లు గడించిన మెగా ఫ్యామిలీకి చెందిన ఇల్లు ఇది. సాక్షాత్తు చిరంజీవి అమమ్మగారి ఇల్లు. ఈ ఇంట్లో ఉండే చిరంజీవి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివారు. ఈ ఇంటిలోనే అద్దం ముందు నిల్చుని డాన్స్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ ఇంటిలో నుంచే సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తరువాత మెగాస్టార్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నారు. చిరంజీవి మేనమామకు చెందిన ఇల్లయినా కూడా, ఈ ఇల్లు చిరంజీవి అధీనంలోనే ఉండేది. అయితే చిరంజీవి జ్ఞాపకంగా ఈ ఇంటిని గ్రామంలో ఓ మోడల్‌గా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, అభిమానులు కలలు కన్నారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వాలని చిరు అండ్ బ్రదర్స్‌ను అడిగారు. ఈ ఇంటిలో గ్రంథాలయం గానీ, ప్రభుత్వ ఆసుపత్రిగానీ ఏర్పాటు చేస్తామని మీ జ్ఞాపకంగా ఉంటుందని అడిగించారు. కానీ 1999లో కేవలం 1.25 లక్షల రూపాయలకు ఇంటిని వేరే వారికి అమ్మేసుకుని, పురిటి గడ్డలో చిన్నపాటి జ్ఞాపకాన్ని కూడా మిగల్చకుండా కక్కుర్తి చూపింది ఈ మెగా ఫ్యామిలీ. మేనమామ ఇల్లయినా కూడా ఆ సొమ్మేదో చిరు ఫ్యామిలీ చెల్లించి, ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వడానికి ఈ మెగా బ్రదర్స్‌కు రూ 1.25 లక్షలు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సొంతూరిపై కూడా పిసరంతైనా మమకారం లేదని నిరూపిస్తోంది ఈ ఘటన. సాయంచేసే మనసు లేదు చిరంజీవికి గాని, వారి సోదరులకు గానీ ఇతరులకు సాయం చేసే మనసు లేదు. నేను దగ్గరి నుంచి గమనించారు. మొగల్తూరులో కళాశాల పెట్టాలని అనుకున్నప్పుడు అనేకసార్లు చిరంజీవిని కలిశాము. అతనితో ఊళ్లో చదువుకున్న వాళ్లని కూడా తీసుకెళ్లేవాడిని. ఒకసారి కృష్ణంరాజుతో కూడా చెప్పించాము. చిన్నవాడు నాగేంద్రబాబుకు కూడా విషయం తెలుసు. సినిమాల్లో అంత ఎత్తుకు ఎదిగారు, ఎవ్వరికీ పైసా సాయం చేయలేదు. సొంత ఊరు, సొంత మనుషులకే ఏమీ చేయని వారు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవ చేస్తారంటే ఎలా నమ్మాలి. – అందే భుజంగరావు, పేరుపాలెం, మొగల్తూరు మండలం ఊరిపై వారికి పెద్దగా ప్రేమ ఉండదు చిరంజీవి, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాము. నేను ఒక సంవత్సరం సీనియర్ని. చిరంజీవి కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ఈ ఊరిని అసలు పట్టించుకోలేదు. పెద్ద స్టార్ అయ్యాడు గానీ, ఈ ఊరిని అభివృద్ధి చేద్దాము, ఇక్కడి వారిని డెవలప్ చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఊరిలో సొంత ఇంటిని కూడా అమ్మేసుకున్నారు. పవన్ కల్యాణ్ పెద్దగా తెలియదు కానీ, నాగేంద్రబాబు కూడా ఇక్కడే తిరిగేవారు. – పువ్వాడ శేషగిరి, మొగల్తూరు మనం గొప్పలు చెప్పుకోవడమే చిరంజీవి నా వద్దే చదువుకున్నాడు. 9, 10 తరగతులప్పుడు నావద్దే చదువుకున్నాడు. వాళ్ల నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ రావడంతో వేరే చోటుకు వెళ్లారు. కానీ అమ్మమ్మ ఊరు కావడంతో సెలవులకు ఇక్కడ (మొగల్తూరు)కే వచ్చే వారు. నాగేంద్రబాబు కూడా ట్యూషన్‌కు వచ్చేవాడు. పెద్ద వాళ్లు అయ్యారు. చిరంజీవిది మొగల్తూరు అని మనం గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే వారు సొంతూరుకు చేసింది ఏమీలేదు. – పులగండం వెంకటేశ్వరరావు, చిరంజీవికి చదువు చెప్పిన టీచర్ -
మొగల్తూరుకు చిరు ఫ్యామిలీ చేసిందేమీ లేదు..
సాక్షి, భీమవరం : మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మొగల్తూరుకు చేసిందేమీ లేదని స్థానికుడు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి భుజంగరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ’చిరంజీవి కుటుంబం వల్ల మొగల్తూరులోని ప్రజలకు ఏం ప్రయోజనం జరగలేదు. విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతకీ సమాజానికి ఏం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న వ్యవహారాన్ని కానీ, ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు ఘటనను పవన్ ఎందుకు ఖండించలేదు. అంటే చంద్రబాబుతో ఉన్న రహస్య స్నేహం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లు భావిస్తే ప్రజలు చూస్తున్నారు. ఏపీ రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని మొన్నటి వరకూ చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు పవన్. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబుతో పవన్ కుమ్మక్కు అయ్యారని ప్రజలు భావిస్తున్నారు.’ అని అన్నారు. -
మొగల్తూరులో విషాదం
సాక్షి, మొగల్తూరు(పశ్చిమ గోదావరి): మొగల్తూరులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరి పిల్లల గొంతు నులిమి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నల్లమిల్లి లక్ష్మీ ప్రసన్న(28) తన ఇద్దరి పిల్లలు రోజా లక్ష్మి (8), జ్ఞానవి(5)ల గొంతు నులిమి చంపింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అనుమానమే పెనుభూతమై..
సాక్షి, మొగల్తూరు: కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన శని వారం మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగింది. ఎస్సై కె.గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పేరుపాలెం నార్త్ పంచాయతీ కవురువారిపాలెంకు చెందిన గుబ్బల నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుబ్బల ఏడుకొండలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన ఏడుకొండలు భార్యపై అనుమానం పెం చుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క త్తితో భార్యపై దాడి చేయడంతో మెడపైన, కుడికాలు, కుడి చేతిపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబ స భ్యులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలిం చారు. బాధితురాలు తల్లి కట్టా సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గురవయ్య తెలిపారు. -
పేరుపాలెంలో చిరంజీవి పర్యటన
మొగల్తూరు: రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో సోమవారం పర్యటించారు. రెండు కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు. అంతకుముందు మొగల్తూరులో రూ. 50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఇటీవల రూ. 5 కోట్లు మంజూరు చేశారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. -
ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధమే
మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై రాజకీయ, రైతు, మత్స్యకార నేతల అల్టిమేటం నరసాపురం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధం తప్పదని రాజకీయ, రైతు, మత్స్యకార నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఆదివారం మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లింది. సభ జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించినా.. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనకారుల లక్ష్యం ముందు అవేమీ నిలబడలేదు. సభలో ఆక్వా ఫుడ్‌పార్కు పోరాటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, రైతు, మత్స్యకార సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. పార్కు నిర్మాణం విషయంలో ప్రభుత్వం నాటకాలాడుతోందని వారు విమర్శించారు. ఓవైపు తాత్కాలికంగా పనులు ఆపుతున్నామని చెబుతున్న సర్కారు.. మరోవైపు కలెక్టర్‌తో.. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులేమీ ఉండవని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడంపై వారు మండిపడ్డారు. ఫుడ్‌పార్కు పనులను శాశ్వతంగా నిలిపేయాలని డిమాండ్ చేశారు. సభకు అధికార పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఇక పనులు జరగవని చెప్పి వెళ్లిపోయారు. తమ మాటలు కూడా వినాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరుతున్నా.. వినకుండా ఎమ్మెల్యే వేదిక దిగిపోవడంపై మధు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు కాదు రాతపూర్వకంగా తెలియజేయాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు. సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, ఐద్వాజిల్లా కార్యదర్శి కమల, పాలంకి ప్రసాద్, బొమ్మిడి నాయకర్ తదితరులు మాట్లాడారు. ఇద్దరు పాశ్రామికవేత్తలకు కొమ్ముకాయడం కోసం, నాలుగు మండలాల ప్రజల జీవితాలను సర్కారు ఫణంగా పెడుతోందని వారు విమర్శించారు. సభకు మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్రె ప్రసాద్ అధ్యక్షత వహించారు. నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం, భీమవరం మండలాలకు చెందిన ప్రజలు, రైతులు, మత్స్యకారులు 3 వేల మందికిపైగా పాల్గొన్నారు. రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే: మధు ఫుడ్‌పార్కు నిర్మాణం చేపట్టబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ వచ్చేవరకూ ప్రజా పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజలు ఫుడ్‌పార్కు వల్ల కాలుష్యం పెరుగుతుందని, జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేస్తామని, ఈ నిర్మాణం వల్ల నష్టమేమీ జరగదని మభ్యపెట్టేందుకు యత్నించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటన చేయాలి: కొత్తపల్లి గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు పేరుతో ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో నిర్మించనివ్వబోమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. సభలో కొత్తపల్లి ప్రాజెక్టు వల్ల గ్రామాలు ఎలా నష్టపోతాయో వివరించారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు: మాజీమంత్రి మోపిదేవి అభివృద్ధి అనేది ప్రజల అంగీకారంతో జరగాలని, అధికారం ఉంది కదాని ప్రజలపై దౌర్జన్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. కంపెనీలో తమ జీవితాలు బుగ్గవుతాయని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పరిశ్రమలకు పచ్చని పొలాలు కావాలా: సీపీఐ రామకృష్ణ ముఖ్యమంత్రికి పరిశ్రమలు పెట్టడానికి, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని పంటలు పండే పచ్చని పొలాలు, విలువైన భూములే కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చవగ్గా భూములు దొరికే రాయలసీమలో ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదని ప్రశ్నించారు. -
50 పిడకలు @ రూ.15
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పండగంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు. గోవు పేడతో పిడకలు చేసి దండగా మార్చి భోగి మంటలలో వేస్తారు. ఈ సంప్రదాయం పట్టణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తోంది. అయితే పల్లెవాసులకు పిడకలు తయారుచేసే తీరిక, ఆసక్తి తగ్గుతోంది. దీనినే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 50 పిడకలను దండగా కట్టి రూ.15 విక్రయిస్తున్నారు. మొగల్తూరులోని పలు దుకాణాల వద్ద పిడకల దండలు కనిపిస్తున్నాయి. పిడకల తయారీపై గ్రామీణులలోనూ ఆసక్తి తగ్గిందనడానికి ఇది నిదర్శనం. -
సముద్రస్నానానికెళ్లి ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి (మొగల్తూరు) : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద శుక్రవారం సముద్ర సాన్నానికెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నర్సాపురం మండలం రాయిపేటకు చెందిన గంగాధర ముర ళీకృష్ణ(35), రాకేష్ కాశి(18)లు ప్రమాదవశాత్తు మరణించారు. మురళీకృష్ణ బెంగుళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, రాకేష్ స్థానికంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దుబాయి అని చెప్పి ... ముంబైలో దింపేశారు
ఏలూరు : పశ్చిమగోదావరి జల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ ఏజెంట్ల మాయమాటలో పడి జిల్లాలోని మొగల్తూరు గ్రామానికి చెందిన దాదాపు 45 మంది యువకులు మోసపోయారు. గల్ఫ్ పంపిస్తామంటూ ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో వారిని విమానం ఎక్కించిన ఏజెంట్లు ముంబైలో వదిలేశారు. దాంతో సదరు యువకులు రెండు రోజుల పాటు ముంబైలో చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు తెప్పించుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఏజెంట్ల నుంచి తమ డబ్బును ఇప్పించాలని మెగల్తూరు యువకులు శుక్రవారం అందోళనకు దిగారు. -
అంతరిక్ష పరిశోధనలో ఆయనే సాటి
మొగల్తూరు, న్యూస్‌లైన్: మారుమూల గ్రామంలో పుట్టి అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యూరని తెలిసి మొగల్తూరు గడ్డ పులకించింది. ఇక్కడే పుట్టిపెరిగిన సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని గతంలోనే పద్మభూషణ్ వరించగా, తాజాగా ప్రసాద్ పద్మశ్రీకి ఎంపిక కావడంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు పద్మ పురస్కారాలకు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. మలపాక సూర్యనారాయణ, భాస్కరమ్మ దంపతుల మూడో కుమారుడైన ప్రసాద్ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నతస్థారుుకి ఎదిగారు. 1953 మే4న మొగల్తూరులో పుట్టిన ప్రసాద్ 1968లో ఇక్కడి పెన్మత్స రంగరాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1969లో ఏలూరులో పీయూసీ చదివారు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ అభ్యసించారు. తిరువనంతపురం ఇస్రో కేంద్రంలో జూనియర్ సైంటిస్ట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అందులో ఉన్నత పదవులను అధిరోహించారు. చంద్రయాన్-1 విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ ఇటీవల మార్స్ ఉప గ్రహ ప్రయోగంలోనూ ముఖ్యభూమిక పోషించారు. మొగల్తూరు వాసులు చిట్టిబాబుగా పిలుచుకునే ప్రసాద్‌కు పద్మశ్రీ దక్కడంపై గ్రామస్తులు పులకించిపోతున్నారు. ప్రసాద్‌కు ఆయన చిన్ననాటి స్నేహితులైన అనంతపల్లి బుల్లెబ్బాయి, ఉద్దగిరి వెంకన్న, పడాల భాస్కరరావు, అయితం దుర్గారావు, దూసనపూడి ఆదియ్య, నాగళ్ళ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.