
సాక్షి, మల్లిబోయినపల్లి(ఆగిరిపల్లి): తాను అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగి వైఎస్సార్‌సీపీని వీడే వ్యక్తిని కాదని కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఆగిరిపల్లి మండలంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో జిల్లాలో తానే మొదట చేరారని గుర్తు చేశారు.
తాను ప్రలోభాలకు లొంగి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ఎవరో అనామకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారు తన వద్దకు వస్తే వివరణ ఇస్తానని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను వైఎస్ జగన్‌ని కలుసుకునేందుకు ఏనాడు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పదవులకు ఆశపడి పార్టీ మారడం దారుణమని విమర్శించారు.