Nuzvid MLA
-
ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాను
సాక్షి, మల్లిబోయినపల్లి(ఆగిరిపల్లి): తాను అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడే వ్యక్తిని కాదని కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఆగిరిపల్లి మండలంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో జిల్లాలో తానే మొదట చేరారని గుర్తు చేశారు. తాను ప్రలోభాలకు లొంగి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ఎవరో అనామకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారు తన వద్దకు వస్తే వివరణ ఇస్తానని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను వైఎస్ జగన్ని కలుసుకునేందుకు ఏనాడు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పదవులకు ఆశపడి పార్టీ మారడం దారుణమని విమర్శించారు. -
ప్రాణం పోయినా టీడీపీలో చేరను: ప్రతాప్ అప్పారావు
విజయవాడ: ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీలో చేరనని కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ తన కుమారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశాడన్న వార్తలు అవాస్తవమన్నారు. దమ్ముంటే నిరూపించాలని మేకా అప్పారావు సవాల్ విసిరారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎప్పుడూ తప్పులు చేయలేదని, ప్రభుత్వానికి తాను భయపడేది లేదని ఎమ్మెల్యే అన్నారు. -
మేకా ప్రతాప్ సతీమణికి వైఎస్ జగన్ ఘననివాళి
నూజివీడు(కృష్ణాజిల్లా): నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. మేకా ప్రతాప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. పేదలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట జిల్లా ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. -
విజయవాడ పరిసరాలంటే గుంటూరు జిల్లానా..!
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నూజివీడు : విజయవాడ పరిసరాలు అంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు, అమరావతా? అని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్అప్పారావు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములుంటే రాజధానిని ఇక్కడ నిర్మించకుండా వరద ముంపునకు గురయ్యే తుళ్లూరు ప్రాంతంలో నిర్మించడానికి ప్రయత్నించడాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిని విజయవాడ పరిసరాల్లోనే ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలంటే ఏవో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం పేర్కొంటున్న తుళ్ళూరు, అమరావతి ప్రాంతాలలోని నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడానికి అనువైనది కాదని నిపుణులు చెప్తుండగా అక్కడ రాజధానిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో, కంచికచర్ల ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన పెద్దలు భూములుకొన్నారని, గతంలో ఎకరం రూ.25 లక్షలున్న భూమిని ఇప్పుడు రూ.3 కోట్లు, 4 కోట్లు చేసేశారని, ఆ భూములను వేల కోట్లకు అమ్ముకోవడానికి రాజధానిని అక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. అక్కడ రాజధానిని ఏర్పాటు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏడాదికి నాలుగైదు పంటలు పండే భూములను రాజధానికి తీసుకోవాలన్న ఆలోచన రావడమే సిగ్గుచేటన్నారు. నూజివీడు ప్రాంతం సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున ఉండటమే కాకుండా తుపాన్లు, ముంపు బారిన పడని ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు మధ్యభాగంలో ఉందన్నారు. అంతేగాకుండా ఇక్కడ ప్రభుత్వ, అటవీ భూములు వేలాది ఎకరాలున్నాయన్నారు. 1953లోనే రాజధానిని నూజివీడులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాగా, అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కర్నూలులో ఏర్పాటు చేశారన్నారు.