విజయవాడ పరిసరాలంటే గుంటూరు జిల్లానా..!
ఎమ్మెల్యే మేకా ప్రతాప్
నూజివీడు : విజయవాడ పరిసరాలు అంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు, అమరావతా? అని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములుంటే రాజధానిని ఇక్కడ నిర్మించకుండా వరద ముంపునకు గురయ్యే తుళ్లూరు ప్రాంతంలో నిర్మించడానికి ప్రయత్నించడాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిని విజయవాడ పరిసరాల్లోనే ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.
విజయవాడ పరిసర ప్రాంతాలంటే ఏవో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం పేర్కొంటున్న తుళ్ళూరు, అమరావతి ప్రాంతాలలోని నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడానికి అనువైనది కాదని నిపుణులు చెప్తుండగా అక్కడ రాజధానిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో, కంచికచర్ల ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన పెద్దలు భూములుకొన్నారని, గతంలో ఎకరం రూ.25 లక్షలున్న భూమిని ఇప్పుడు రూ.3 కోట్లు, 4 కోట్లు చేసేశారని, ఆ భూములను వేల కోట్లకు అమ్ముకోవడానికి రాజధానిని అక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అక్కడ రాజధానిని ఏర్పాటు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏడాదికి నాలుగైదు పంటలు పండే భూములను రాజధానికి తీసుకోవాలన్న ఆలోచన రావడమే సిగ్గుచేటన్నారు. నూజివీడు ప్రాంతం సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున ఉండటమే కాకుండా తుపాన్లు, ముంపు బారిన పడని ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు మధ్యభాగంలో ఉందన్నారు. అంతేగాకుండా ఇక్కడ ప్రభుత్వ, అటవీ భూములు వేలాది ఎకరాలున్నాయన్నారు. 1953లోనే రాజధానిని నూజివీడులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాగా, అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కర్నూలులో ఏర్పాటు చేశారన్నారు.