
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను ప్రేరేపించిందెవరని, ఈ దాడి వెనుక కుట్రదారులెవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి రాజకీయ కారణాలతో బయటకొచ్చారన్నారు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై కేకలేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదట్నుంచీ పోరాడుతుంది వైఎస్సార్‌సీపేనని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై టీడీపీ నేతల స్పందన దారుణంగా ఉందన్నారు. ఈ దాడిని చిన్న ఘటనగా చిత్రీకరించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, విచారణ చేయకుండా డీజీపీ స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జగన్‌ను కైమా చేసేవాళ్లమని టీడీపీ నేతలు అనడం ఎంతవరకు సమంజసమని అడిగారు. రాష్ట్రపతి,కేంద్ర హోంమంత్రిలను కలిసి దాడి ఘటనను నివేదిస్తామని ఈ సందర్భంగా మేకపాటి పేర్కొన్నారు.
టీడీపీ పెద్దల హస్తం: ధర్మాన
వైఎస్ జగన్‌పై దాడి వెనుక టీడీపీ పెద్దల హస్తముందని ధర్మాన ఆరోపించారు. వారికి సంబంధం లేనప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించొచ్చు కదా అని ప్రశ్నించారు. థర్డ్‌పార్టీ ఏజెన్సీతో విచారణ జరిగితేనే ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను పనిచేయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ పాత్ర కాకుండా .. చంద్రబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దయాదాక్షిణ్యాలపై బతకకపోతే ఎవర్నైనా కైమా చేసేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగనివ్వకుండా స్టేలు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అక్రమ సంపాదనపై దాడులు జరిగితేనే ప్రజలకు నమ్మకమొస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉండటంతో వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ధర్మాన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment